కారుమూరి నాగేశ్వ‌ర‌రావు అరెస్టు అక్ర‌మం 

ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించే బీసీల‌ను అణ‌గదొక్కే కుట్ర‌

కూటమి ప్రభుత్వ కక్షసాధింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు 

ముదునూరి ప్రసాదరాజు స్ప‌ష్టీక‌ర‌ణ‌

భీమవ‌రం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు 
ముదునూరి ప్ర‌సాద‌రాజు

లిక్కర్ స్కామ్ పేరుతో అక్ర‌మంగా అరెస్టు చేశారు

మ‌ద్యం వ్యాపారంతో ఆయ‌న‌కు సంబంధ‌మే లేదు

వైయ‌స్ఆర్‌సీపీలో బీసీల‌ను రాజకీయంగా దెబ్బ‌తీసే కుట్ర

కూట‌మి కుట్ర‌ల‌ను స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తిప్పికొడ‌తాం

ముదునూరి ప్రసాదరాజు హెచ్చ‌రిక 

భీమవరం : వెన్నుపోటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని పశ్చిమ గోదావరి జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ ముదునూరి ప్రసాదరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. లిక్కర్ స్కామ్ పేరుతో మాజీ మంత్రి, బీసీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మద్యం వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేని కారుమూరి నాగేశ్వరరావుపై తప్పుడు అభియోగాలు మోపి ఈడీ పేరుతో జైలుకు పంపారని మండిపడ్డారు. పార్టీలో రెండు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ పసలేని కేసు బనాయించారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలనే ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా మార్చుకుందని ముదునూరి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, కానీ సోషల్ మీడియాలో ప్రశ్నించే కార్యకర్తలను, వాస్తవాలు మాట్లాడే నాయకులను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వ తీరు మారలేదని ఆరోపించారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన వాగ్దానాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. కొత్త పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సిన నిధులు, రైతులకు ఇస్తామన్న రూ.20 వేల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అక్ర‌మ అరెస్టుల పర్వానికి తెరతీశారని ఆరోపించారు.

స్థానిక పోరులో సత్తా చాటుతాం 
అక్రమ కేసులకు, నిర్బంధాలకు భయపడే సంస్కృతి వైయ‌స్ఆర్‌సీపీకి లేదని ప్రసాదరాజు తేల్చిచెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా, తాము మాత్రం ఒంటరిగానే నిర్భయంగా పోటీ చేసి సత్తా చాటుతామన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధింపులు, కేసులు, నిర్బంధాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, జగన్ గారికి వస్తున్న ప్రజాదరణను చూసి ప్రజలు మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ పక్షాన నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కారుమూరి కుటుంబానికి పార్టీ శ్రేణులు పూర్తి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని, కారుమూరి నాగేశ్వరరావు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ముదునూరి ప్ర‌సాద‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top