శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ఓటర్ల జాబితాలో లోపాలు, మున్సిపల్ స్థలాల అక్రమ వినియోగం, దేవస్థానం భూముల వివాదంపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి గళమెత్తారు. సోమవారం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఆయన మున్సిపల్ కమిషనర్‌కు పలు సమస్యలపై అర్జీ అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఓటుకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? “మున్సిపల్ కార్యాలయంలో నా కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితాను పరిశీలిస్తే అనేక లోపాలు కనిపించాయి. మాజీ ఎమ్మెల్యేగా నా ఓటుకే రక్షణ లేకపోతే సామాన్యులు, దివ్యాంగుల పరిస్థితి ఏమిటి? అర్హులైన ప్రతి ఒక్కరి ఓటుకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి. ఆరు నెలలుగా మా ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలి” అని బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. శ్రీరాముల వారి భూములను కబ్జా చేస్తే జైలుకు పోక తప్పదు “శ్రీరాములవారికి సంబంధించిన దేవస్థానం భూములు, మాతమ్మ భూములు, ఎస్సీలకు కేటాయించిన స్థలాలను నకిలీ పత్రాలతో ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు రూ.150 కోట్ల విలువైన భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఈ వివాదాస్పద భూములను ఎవరూ కొనుగోలు చేసి మోసపోవద్దు. ఒక్క సెంట్ భూమి కూడా కొనుగోలు చేయకండి. రేపు మేము అధికారంలోకి రాగానే కబ్జాకు గురైన భూమిలో శ్రీరాముల వారి దేవాలయం నిర్మిస్తాం. ఆ భూమికి హక్కుదారులైన పేదలకు వారి స్థలాలను తిరిగి అందజేస్తాం. శ్రీరాముల వారి భూములను కబ్జా చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదు. అక్రమార్కులు నిర్మించే భవనాలు భవిష్యత్తులో ప్రజలకే చెందుతాయి” అని బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ అక్రమాల ఆధారాలు త్వరలో బయటపెడతాం “కాళహస్తిలో ప్రారంభమైన ఈ భూ అక్రమాల వెనుక విజయవాడలోని మంత్రుల నుంచి ఢిల్లీ వరకు సంబంధాలు ఉన్నాయని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అన్ని ఆధారాలు, పత్రాలను త్వరలో బయటపెడతాను. ఈ అంశంపై వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చర్చిస్తాం. పార్టీ అండతో శ్రీకాళహస్తి ప్రజలు, స్వామీజీల భాగస్వామ్యంతో పోరాటం చేస్తాం. తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించి, విజయవాడలో ధర్నా చేస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు స్వామీజీలతో కలిసి న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తాం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో గంజాయి సంస్కృతి, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. పోలీసు యంత్రాంగం నిరంతరం తనిఖీలు నిర్వహించి నేరాలను శాశ్వతంగా అరికట్టాలి. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి” అని బియ్యపు మధుసూదన్‌రెడ్డి కోరారు. మున్సిపల్ స్థలాల అక్రమ వసూళ్లను అరికట్టాలి “మున్సిపల్ పరిధిలోని స్థలాల్లో టెండర్లు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రోడ్డు పక్కన బుట్టల్లో చిరు వ్యాపారం చేసుకునే పేద వ్యాపారుల నుంచి కూడా అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. వాటిని వెంటనే అరికట్టాలి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రేడ్-1లో ఉన్న శ్రీకాళహస్తి మున్సిపాలిటీ నేడు గ్రేడ్-2కు ఎందుకు పడిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని ఆయన అన్నారు. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు చర్యలకు తావులేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చామని బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇంటి వద్ద చెత్త కూడా ఎత్తకుండా కొత్త విధానాలకు తెరతీశారని, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న పాలకులకు తగిన మూల్యం తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉత్తరాజి శరవణ, మున్నా రాయల్, బులెట్ జయశ్యాం, పంతులు, గోరా, సూర సురేష్ తదితర వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.