తాడేపల్లి: హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు సమాజం పట్ల, వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ముందు హాజరై వివరణ ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఛైర్ పర్సన్ అడిగిన మూడు ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు అమర్నాథ్ వెల్లడించారు. అధికారంలోకి రాక ముందు నుంచే వంగలపూడి అనిత తమ పార్టీ నేతలపై, అధినేత జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యల్ని సైతం మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు అమర్నాథ్ తెలిపారు. మహిళలపై తనకు అత్యంత గౌరవం ఉందని, అయితే తన వ్యాఖ్యలకు మాత్రం కట్టుబడి ఉంటానని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రెస్ మీట్లో గుడివాడ అమర్నాథ్ ఇంకేమన్నారంటే.. గత నెల 12న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో ప్రజల్ని ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ వివరణ కోరింది. ఇందులో మేకప్ మంత్రి వ్యాఖ్యలపై వివరణ అడిగారు, యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్లు భావించవచ్చా అని కమిషన్ ఛైర్ పర్సన్ అడిగారు. నేను చేసిన ఓ వ్యాఖ్య ఓ రాజకీయ వ్యంగాస్త్రం మాత్రమేనని సమాధానం ఇచ్చాను. గతంలో అనేక సందర్భాల్లో మాపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై హోంమంత్రి ఇష్టారాజ్యంగా, ఏకవచనంలో వ్యాఖ్యలు చేస్తున్నారన్న విషయం కమిషన్ దృష్టికి తెచ్చాను. దీంతో పాటు మీరు చేసే ఉద్యోగాలు మా వాళ్లు చేయలేరని నేను చేసిన మరో వ్యాఖ్యపైనా అడిగారు. హోంమంత్రిగా మీకిచ్చిన ఉద్యోగం మానేసి ఇతర పనులపై దృష్టిపెడుతున్నారనే విషయం చెప్పినట్లు కమిషన్ దృష్టికి తెచ్చాను. నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని హోంమంత్రి వాడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలపై మరో ప్రశ్న వేశారు. తాను చేసి వదిలేసిన జిల్లా మంత్రి పదవిలో ఇప్పుడు ఆమె ఉన్నారని వివరణ ఇచ్చినట్లు చెప్పాను. అలాగే నేను ఎలాంటి తప్పు చేయలేదని, చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పాను. టీడీపీ నాయకులు ఊహించుకున్న మాటలకు నేను సమాధానం చెప్పను, ఆ అవసరం నాకు లేదు. రెండేళ్లుగా మీరు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం, మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాల్సిన హోంమంత్రి, అవన్నీ వదిలేసి రాజకీయంగా నేను ఓ మాట అంటే బాధపడుతున్నారా ? నా మాటల మీద నకిలీ ఉద్యమాన్ని తెచ్చి మహిళలతో తిట్టించారు. మేకప్ వేసుకున్నారని ఓ మాట అంటే మీకు బాధేస్తుంటే.. రోజూ మీరు, నాయకులు నన్నూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్న మాటలకు ఏం చెప్పాలి. కొడుకు బూడిద కోసం విజయవాడలో ఓ మహిళ అల్లాడిపోతోంది, 20 రోజులుగా జాహ్నవి అనే పసిపాప తప్పిపోతే, ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంటే సమాధానం చెప్పాల్సిన హోంమంత్రి.. 15 రోజుల తర్వాత వెళ్లి పరామర్శించారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేస్తే మీరు ఎందుకు స్పందించలేదు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన చేతిలో మోసపోయిన బాధితురాలిపై నడిరోడ్డుపై దాడి చేయిస్తుంటే మీకు కనిపించలేదా ? హోంమంత్రిని విమర్శిస్తారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మేం అధికారంలో ఉండగా 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు, వాళ్లలో ఎంత మందిని తిరిగి తీసుకొచ్చారో చెప్పండి. నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యాక ఇస్తానని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న హోంమంత్రి పనికిరారా ? అధికార పార్టీ నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అంటే ఇంకా సిగ్గు రావడం లేదా ? రాష్ట్రంలో మహిళలపై గౌరవం ఉన్న వ్యక్తిగా 15 ఏళ్ల వయస్సులో నా తండ్రి చనిపోతే, నన్ను పెంచిన తల్లి ఓ మహిళ అన్న విషయం గుర్తుచేస్తున్నా. నా కుటుంబాన్ని నడుపుతున్న వారు మహిళలు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మహిళలపై ఎలాంటి గౌరవం ఉండాలన్నది మీ నుంచి నేను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మహిళలకు గొప్ప స్ధానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మేం పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈసారి మాపై బూతు విమర్శలు దిగితే తగిన గుణపాఠం చెప్తాం. మీ పాలనా కాలం ముగిసిపోతోంది. వచ్చే ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలైతే కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్లే. మహిళా కమిషన్ సమయాన్ని వృథా చేయకుండా రాష్ట్రంలో మహిళల సమస్యలపై, వారికిచ్చిన హామీలపై హోంమంత్రి దృష్టిపెడితే బాగుంటుంది. ఐదేళ్లుగా ఓ ఆదర్శ నాయకుడిగా ఉండేందుకు ప్రయత్నించాను. ఐదేళ్లు తట్టుకుని ఇప్పుడు ఒక్క మాట అంటే తట్టుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారు. వరుదు కల్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళకు ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్లు చేయించినా, బాధితురాలిపై దాడి చేయించినా చర్యల్లేవు. ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపులకు గురైన టీడీపీ మహిళానేత న్యాయం కోరితే చర్యల్లేవు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ వేధింపులకు ఓ మహిళ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే చర్యల్లేవు. ఇప్పుడు మీ హోంమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే , దానికి మాజీ మంత్రి స్పందిస్తే సుమోటోగా చర్యలు తీసుకుంటారా ? మీరు టీడీపీ అజెండాతో పనిచేస్తున్నారు, ప్రజల అజెండాతో పనిచేయడం లేదని అర్దమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాల్లో మొదటిస్దానంలోకి వచ్చింది, మహిళల అక్రమ రవాణాలో మూడో స్ధానానికి వచ్చింది. రోజుకు 70 మంది మహిళలపై దాడులు జరుగుతుంటే, అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఎక్కడున్నారు ? ముందు హోంమంత్రి అనితను మహిళా కమిషన్ పిలిపించి విచారణ జరిపించి, ఆ తర్వాత రాష్ట్రంలో మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలి. గుమ్మ తనూజారాణి, అరకు ఎంపీ గుడివాడ అమర్నాథ్ కు మద్దతుగా ఇంత మంది మహిళలు ఇక్కడికి తరలివచ్చారంటే ఆయన ఎలాంటి తప్పూ చేయలేదని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. హోంమంత్రిగా గౌరవ ప్రదమైన స్ధానంలో ఉన్న మహిళ అనిత మాజీ ముఖ్యమంత్రిపై, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నా మేం భరించాం. దీనికి అడ్డుకట్ట పడకపోవడంతో మాజీ మంత్రి అమర్నాథ్ ఓ వ్యాఖ్య చేస్తే నానా యాగీ చేస్తున్నారు. మహిళా కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించకూడదు. పార్టీలపై ఎలాంటి విపక్ష చూపకూడదు. గతంలో మా పార్టీలో మహిళా నేతలపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. కానీ ఇప్పుడు అమర్నాథ్ మాటలకు మాత్రం వెంటనే స్పందించారు. ఆరె శ్యామల, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ తప్పూ చేయని, ఎలాంటి అసభ్య పదజాలం వాడని గుడివాడ అమర్నాథ్ ను నోటీసులిచ్చి మహిళా కమిషన్ పిలిపించింది. ఆరు రోజుల క్రితం జడ్పీ ఛైర్ పర్సన్ హారిక, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, నేను కలిసి లోకేష్ సహా ఐదుగురు టీడీపీ నేతల మీద ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వారిని పిలిచి మాట్లాడలేదు. కానీ ఇవాళ అమర్నాథ్ గారికి మాత్రం నోటీసులిచ్చారు. మహిళా కమిషన్ కొందరి వ్యక్తిగత ఇగోల్ని సంతృప్తి పర్చేందుకు ప్రయత్నిస్తోంది. అనిత ను మేకప్ మంత్రిగా చూస్తోంది వైఎస్సార్సీపీ కాదు రాష్ట్రంలో మహిళలే. మహిళలకు ఆమె ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. మహిళలకు అనిత చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్రంలో మహిళలంతా గుర్తుపెట్టుకుని మీకు 2029లో సమాధానం ఇస్తారు.