ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

వైయ‌స్ఆర్‌సీపీ బీఎల్‌ఏలకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దిశానిర్దేశం

విజయవాడ: ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఓటును పరిరక్షించడమే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక భవానీపురంలోని శివాలయం సెంటర్ వద్ద పార్టీ సీనియర్ నాయకుడు కొనకళ్ల విద్యాధరరావు నివాసంలో, అలాగే కలరా ఆస్పత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం వైయ‌స్ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా, ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన విషయంలో బీఎల్‌ఏలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రక్రియను నిరంతరం గమనిస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అన్నారు.

టీడీపీ ప్రయోజనాల కోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలపై నిఘా ఉంచి ప్రశ్నించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటర్ల జాబితాను పరిరక్షించడం అత్యంత ముఖ్యమని, ప్రతి బీఎల్‌ఏ తన బూత్‌లోని ఓట్లను కాపాడుకునే బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. బీఎల్‌వోలు తమ పరిధిలో ఎన్ని ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారో, వాటిలో ఎన్ని డిజిటలైజేషన్ చేశారో పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో బీఎల్‌వోలు, బీఎల్‌ఏల సమన్వయ సమావేశాలు జరిగే సమయంలో బీఎల్‌వో అందించే ‘మినిట్స్ కాపీ’ని పూర్తిగా చదివి, అందులోని వివరాలను సరిచూసుకున్న తర్వాతే సంతకం చేయాలని హితవు పలికారు. ప్రతి అర్హ ఓటరికి తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం అందేలా చూడాలని, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. 
 

Back to Top