అమలాపురం/ఒంగోలు: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మృతిపట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో జిల్లా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అదే విధంగా ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో కూడా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై. వెంకటేశ్వర్లు నాయుడు, కేవీ రమణారెడ్డి, మాదాసి వెంకయ్య, కోణికి రోశయ్య, దేవ, బాబీ, రమేష్, ప్రసన్న, వెన్నుపూస వెంకటేశ్వర్లురెడ్డి, క్రాంతికుమార్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజా సేవలను, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.