తాడేపల్లి : దేవరపల్లి పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ప్రజలు, రైతులు, యువత అపూర్వ స్వాగతం పలికారని, ఆ పర్యటన విజయాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం, టీడీపీ నాయకులు అసత్య ప్రచారానికి తెరలేపారని మాజీ మంత్రి తానేటి వనిత ఆరోపించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. దేవరపల్లిలో వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా సునామీలా తరలివచ్చారని, జెడ్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం కనీస పోలీసు భద్రత కూడా కల్పించలేదని విమర్శించారు. మంగళవారం రాత్రికే 300 మందికి పైగా పోలీసులను విధులకు కేటాయించినప్పటికీ, అర్ధరాత్రి సమయంలో వారిని వెనక్కి రప్పించడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ప్రశ్నించారు. హెలిప్యాడ్ వద్ద ఒక్క పోలీసు కూడా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పోలీసుల భద్రత లేకపోయినా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి వైయస్ జగన్‌కు భద్రత కల్పించామని తెలిపారు. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పేందుకే వైయస్ జగన్ గోపాలపురం నియోజకవర్గానికి వచ్చారని పేర్కొన్నారు. మార్గమధ్యంలో వైయస్ జగన్‌ను చూసేందుకు యువత భారీగా రావడంతో లక్ష్మి అనే మహిళ దుకాణం టెర్రస్‌పైకి వెళ్లే క్రమంలో చిన్న ప్రమాదం జరిగిందని, జనసమ్మర్థం కారణంగా టేబుల్‌పై ఉన్న అమ్మవారి ఫోటో కిందపడిన ఘటనను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తానేటి వనిత అన్నారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, యువకులపై స్థానిక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ రైతుల పక్షానే నిలుస్తుందని స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా సెకండ్ గ్రేడ్ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. రైతు భరోసా కింద రూ.20 వేల ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. వరి, మిర్చి, మామిడి, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అప్పుల భారం తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. దేవరపల్లి పర్యటన విజయాన్ని మసకబార్చేందుకే టీడీపీ నాయకులు అనవసర రచ్చ సృష్టిస్తూ దుకాణదారు లక్ష్మి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా వైయస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనను దాచలేరన్నారు. వైయస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన రైతులను "గంజా బ్యాచ్", "బ్లేడ్ బ్యాచ్" అంటూ అవమానించిన ప్రజాప్రతినిధులు వెంటనే రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ వద్ద మార్కులు కొట్టేయడానికే స్థానిక టీడీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వేధింపులకు గురవుతున్న లక్ష్మి కుటుంబానికి, రైతులకు, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.