డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం : డీఎస్సీ–2025 పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని పొన్నాడ బ్రిడ్జి వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ప్రజాస్వామ్యబద్ధమైన, శాంతియుత నిరసనలని పేర్కొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలకు రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. దొంగ సర్టిఫికెట్లు, మెరిట్ లేని సర్టిఫికెట్లకు అవకాశం కల్పించేలా జీవోలు తీసుకురావడం, ప్రశ్నాపత్రాలతో సంబంధం ఉన్నవారే మెరిట్‌లో నిలవడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సూచించిన రిజర్వేషన్ విధానాలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించిన ఆయన, డీఎస్సీ పరీక్షను రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని, ముందుగా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయకుండా ప్రభుత్వం యువత ఆవేదనకు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలపాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
 

Back to Top