ఎన్ఆర్ఐ మహిళను వేధించిన మంత్రిని త‌క్ష‌ణం బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

చాట్‌లు, ఫోటోల ఆధారంగా ఫోరెన్సిక్ విచారణ జరిపించాలి 

ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్ 

విశాఖ‌లోని పార్టీ సిటీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

మ‌హిళ‌ల‌ను వేధిస్తున్న అన్ని కేసుల్లోనూ నిందితులు కూట‌మి నాయ‌కులే

కూట‌మి కీచ‌కుల వేధింపులు రాష్ట్రం దాటి ఖండాంత‌రాలకు వ్యాపించిపోయాయి 

అపాయింట్‌మెంట్ కోరిన మ‌హిళ‌కు ఫొటోలు పంపి వేధించ‌డం సిగ్గుచేటు

వేధించిన విష‌యం తెలిసి కూడా సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్ చ‌ర్య‌లు తీసుకోలేదు

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌ని మ‌రోసారి రుజువైంది

ఈ దారుణానికి హోంమంత్రి అనిత‌, ఇత‌ర మ‌హిళా మంత్రులు ఏం స‌మాధానం చెబుతారు? 

వ‌రుదు క‌ళ్యాణి సూటి ప్ర‌శ్నలు 

విశాఖ‌ప‌ట్నం:  ఎన్ఆర్ఐ తెలుగు మహిళను వేధించిన మంత్రిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేసి, చాట్‌లు, ఫోటోలు తదితర ఆధారాలపై ఫోరెన్సిక్ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖ‌లోని పార్టీ సిటీ కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్ప‌డి 27 నెలలు గడిచినా రాష్ట్రంలో మహిళలకు భద్రత క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై ఏ ర‌క‌మైన వేధింపులు, అఘాయిత్యాలు జ‌రిగినా అందులో కూట‌మి ఎమ్మెల్యేలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే ఉంటున్నార‌ని మండిప‌డ్డారు. ఈ వేధింపుల సంస్కృతిని రాష్ట్రానికే ప‌రిమితం చేయ‌కుండా విదేశాల‌కు విస్త‌రింప‌జేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  వెన్నుపోటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మంత్రి అమెరికాలోని డల్లాస్‌లో ఎన్ఆర్ఐ తెలుగు మహిళను వేధించారని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించక‌పోవ‌డంపై ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సేవా కార్యక్రమాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ కోరిన మహిళను ఒంటరిగా కలవాలని మంత్రి కోరడం, అనుచితంగా ఫోటోలు పంపి వేధించిన విష‌యం తెలిసి కూడా సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ స్పందించ‌క‌పోవడం సిగ్గుచేట‌న్నారు. బాధితురాలు నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బాధితురాలు చేసిన అన్ని ఆరోపణలపై కేసు నమోదు చేసి, నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ దారుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే హోంమంత్రి అనితతో పాటు మహిళా మంత్రులు కూడా ఈ అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని వ‌రుదు క‌ళ్యాణి కోరారు. 

ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే... 

చంద్ర‌బాబుకి మ‌హిళ‌ల ర‌క్ష‌ణ ప‌ట్టడం లేదు
ఈ కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు, గజానికొక దుశ్శాసనుడు తయారయ్యారు. రాష్ట్రంలో రోజూ సగటున నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే, 70 మందిపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. అయినా 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మహిళల రక్షణ పట్టడం లేదు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై గతంలో మహిళల వేధింపుల ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 

డల్లాస్‌లో ఎన్ఆర్ఐ మహిళపై మంత్రి వేధింపులు
అమెరికాలోని డల్లాస్‌లో ఒక‌ టీడీపీ మంత్రి, 'ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్' ఫౌండర్, ఎన్ఆర్ఐ అయిన డాక్టర్ తాళ్లూరి శైలా అనే మహిళను తీవ్రంగా వేధించారు. సేవా కార్యక్రమాల నిమిత్తం అపాయింట్‌మెంట్ అడిగితే, ఒంటరిగా కాఫీ షాప్‌కి రమ్మని సదరు మంత్రి ఆమెపై ఒత్తిడి తెచ్చారు. తన అసభ్యకరమైన ఫోటోలను సైతం ఆమెకు పంపారు. మంత్రి బారి నుంచి తప్పించుకోవడానికి ఆ మహిళ ఎప్పుడో చనిపోయిన తన పెదనాన్న పేరును వాడుకోవాల్సి రావడం అత్యంత దారుణం. ఫిర్యాదు చేసిన ఎన్ఆర్ఐ మహిళపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, వేధింపులు జరుగుతున్నాయి. బాధితురాలికి రక్షణ కల్పించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. 

లోకేష్, చంద్రబాబుల మౌనం 
బాధితురాలు నేరుగా మంత్రి వేధింపుల గురించి, ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఎక్స్  అకౌంట్ వేదికగా నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసినా.., సీఎం, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. తప్పు చేసిన మంత్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. . బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి, టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఆమెపైనే ఎదురుదాడి చేస్తూ పోస్టులు పెట్టడం అత్యంత హేయమైన చర్య. ఈ ఘ‌ట‌న‌తో టీడీపీ అంటే 'తెలుగుదేశం పార్టీ' కాదు 'తెలుగు దుశ్శాసనుల పార్టీ' అని మరోసారి రుజువైంది. 

మహిళా మంత్రులు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?
మహిళలపై చెయ్యి వేస్తే తాటతీస్తానని గతంలో ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? మహిళా హోంమంత్రి అనిత, మంత్రులు సవిత, సంధ్యారాణి తమ పక్కనే క్యాబినెట్‌లో కూర్చుంటున్న ఆ కీచక మంత్రిని మెడపట్టి బయటకు గెంటేసే ధైర్యం చేయగలరా?

గత ఘటనలపై చర్యలు శూన్యం
గతంలో వెన్నుపోటు కూట‌మి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నజీర్, అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి సంధ్యారాణి పీఏ.. ఇలా అనేకమంది నేతలు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. అందుకే ఈరోజు ఏకంగా ఒక మంత్రి ఇంతలా బరితెగించారు. గుంటూరులో మా పార్టీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టేందుకు సొంత భార్య నైటీనే చించేసిన దిగజారుడు చరిత్ర టీడీపీ నాయకులదని వ‌రుదు క‌ళ్యాణి మండిప‌డ్డారు.

Back to Top