డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాలి..

 యువతకు న్యాయం చేయాలి: డాక్టర్ సాకే శైలజానాథ్ 

నార్పల: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని పాత గాంధీ సర్కిల్, బస్టాండ్ ప్రాంతంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ పాల్గొని యువత, విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజం ప్రభుత్వ వైపే ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి అర్హ నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు. లక్షలాది మంది యువత భవిష్యత్తు, విద్యార్థుల హక్కులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకోసమే ఈ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top