హైదరాబాద్: ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కుమారుడు ముద్రగడ గిరి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న తన తండ్రి త్వరగా కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం గురించి శ్రీ వైయస్ జగన్ గారు నిత్యం డాక్టర్లతో సంప్రదిస్తున్నారని, మాకు ధైర్యం చెబుతున్నారని, ఆయన చేస్తున్న సహకారం మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదన్నారు. అలాగే మా నాన్న గారి ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపుతున్న అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఆస్పత్రి వాతావరణంలో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావద్దని ముద్రగడ గిరి విజ్ఞప్తి చేశారు. తన కుటుంబంపై చూపుతున్న ప్రేమ, అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అయితే ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు పూర్తిగా కోలుకున్న అనంతరం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తప్పకుండా కలుస్తారని ముద్రగడ గిరి తెలిపారు.