​కడప ఉక్కు - రాయలసీమ హక్కు 

వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఉక్కు సంకల్పం

వైయస్.జగన్ హయాంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం

మరోసారి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు 

తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న చంద్రబాబు

​కూటమి ప్రభుత్వ 'క్రెడిట్ చోరీ'ని అడ్డుకుంటాం: 

చంద్రబాబుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతల ధ్వజం.

జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వెళ్లిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు  రామసుబ్బారెడ్డి, డీ సీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి,  ఎమ్మెల్యే దాసరి సుధ, వైయ‌స్ఆర్‌సీపీజిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాధ్.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలను జమ్మలమడుగు వద్ద అడ్డుకున్న పోలీసులు.

పోలీసులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు మధ్య వాగ్వాదం.

నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సర్వం సిద్ధం చేసుకున్న జిందాల్ (JSW) స్టీల్ ప్లాంట్‌ను కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతో నిలిపివేసిందని, ఇప్పుడు మళ్లీ అదే ప్లాంట్‌కు చంద్రబాబు భూమిపూజ చేస్తూ 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని బుధవారం ఉదయం పోలీసులు జమ్మలమడుగు వద్ద అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ముందస్తు నోటీసులు జారీ చేసి నేతలను కదలనివ్వకపోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు దివంగత మహానేత వైయస్సార్ విగ్రహం వరకు భారీ పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపాయి.
​అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్.. "కడప ఉక్కు-రాయలసీమ హక్కు" అని స్పష్టం చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వం రూ.750 కోట్లతో భూమి, రోడ్డు, రైల్వే లైన్, విద్యుత్, నీటి వసతులు కల్పించి, రూ.8,800 కోట్లతో జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో పనులు ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులు పెట్టి ఆ సంస్థను భయపెట్టిందని మండిపడ్డారు. పనులు ఆపేసి రెండేళ్లు కాలయాపన చేసిన చంద్రబాబు, ఇప్పుడు ఈనెల 3న మళ్లీ తానే భూమిపూజ చేస్తాననడం రాయలసీమ ప్రజలను వంచించడమేనని, ఇది ముమ్మాటికీ క్రెడిట్ చోరీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఎవరేమన్నారంటే.. 

 జిందాల్ తెచ్చిన  వైయస్.జగన్ : మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి.

రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని తొందరగా నిర్మించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023 ఫిబ్రవరి 15న వైయస్ జగన్ భూమిపూజ చేశారు. నిర్మాణానికి కావాల్సిన మౌళిక వసతులు అంతా నిర్మించడమే కాకుండా, అవసరమైన అన్ని అనుమతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేశారు. ఇందుకోసం 3,500 ఎకరాల భూమిని కేటాయించారు. విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేయాలని చట్టం చెబుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు.
​కేంద్రం ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరపునే స్టీల్ ప్లాంట్ నిర్మించాలని సంకల్పించి, 30 లక్షల టన్నుల సామర్థ్యంతో 25 వేల మందికి ప్రత్యక్షంగా, 75 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్లాంట్‌కు 2019 డిసెంబరులో భూమిపూజ చేశారు. నాటి సీఎం వైయస్ జగన్ గారి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ సీఎం రమేశ్  నాడు సాలువ కప్పారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కార్పొరేషన్ మొదలుపెట్టి, భూమి కేటాయించి, ప్రహారీ నిర్మాణం, జాతీయ రహదారి-67 నుంచి అప్రోచ్ రోడ్, రైల్వే లైన్ కోసం భూసేకరణ, 220 కేవీ లైన్, ప్రత్యేక సబ్ స్టేషన్ మంజూరు చేశారు. గండికోట నుండి 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. మౌలిక సదుపాయాల కోసం రూ.700 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశారు.
​ఈ వాస్తవాలను ప్రజలకు చూపించడానికే మేం వచ్చాం. వైయస్ జగన్ గారి అకుంఠిత దీక్షను ప్రజలకు తెలియజేయాలన్నదే మా ఉద్దేశం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, జేఎస్ డబ్ల్యూ సంస్థ చైర్మన్ ని కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకి గురిచేసి పనులు నిలిపివేసింది. ఇప్పుడు మరలా అదే సంస్థతో పనులు మొదలుపెట్టించే డ్రామాలు ఆడుతోంది. రూ.8,800 కోట్లతో రెండు దశల్లో ప్లాంట్ స్థాపనకు ఆ సంస్థ ముందుకు వస్తే.. కేసులు పేరుతో భయపెట్టిన చంద్రబాబు హయాంలో వచ్చిన పరిశ్రమలు ఏవీ లేవు. గతంలో ఆయన సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలు, డెయిరీలు అన్నింటినీ అమ్ముకున్నారు.

​​వైయస్.జగన్ హయాంలోనే జిందాల్ ప్లాంట్ కు శ్రీకారం: రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ 

రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు అని ప్రచారం చేసుకోవడం మినహా వెనుకబడిన రాయలసీమకు చేసిన మేలేమీ లేదు. విభజన హామీల ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చట్టం చేసినా.. దశాబ్దంగా ఆ కల నెరవేరడం లేదు. నాటి మహానేత వైయస్సార్ హయాంలోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే అనేక కారణాలు, కోర్టు వివాదాల వల్ల ఆ పనులు ఆగిపోయాయి.
​మరలా 2019లో 'ఏపీ హై గ్రేడ్ స్టీల్' కింద వైయస్ జగన్ హయాంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాన్ని 'వైయస్సార్ రాయలసీమ కార్పొరేషన్' కిందకు మార్చి.. రూ.750 కోట్లతో మౌలిక వసతులు కల్పించారు. గండికోట నుండి 2 టీఎంసీల నీళ్లు, రైల్వే లైన్, జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్ కనెక్టివిటీ చేపట్టారు. విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. మొత్తం మౌలిక సదుపాయాల కోసం రూ.750 కోట్ల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారు. ఈ విషయాలను ప్రజలకు వివరించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు.

అమ్మఒడి, రైతు భరోసా తరహాలో జగన్ కట్టిన స్టీల్ ప్లాంట్‌పైనా చంద్రబాబు 'క్రెడిట్ చోరీ' డ్రామా!"
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్. 

వైయస్ జగన్ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకెళ్తే.. మరలా ఇప్పుడు చంద్రబాబు వచ్చి నేనే చేస్తున్నా అని ఎలా చెబుతారని మేం ప్రశ్నిస్తున్నాం. 'క్రెడిట్ చోరీ' అన్నది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వైయస్ జగన్ 'అమ్మఒడి' పెడితే దాన్ని క్రెడిట్ చోరీ చేసి.. 'తల్లికి వందనం' అని పేరు మార్చాడు. 'రైతు భరోసా' ని 'అన్నదాత సుఖీభవ' అని మార్చాడు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారు.
​స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఉక్కు సంకల్పం చేసిన వ్యక్తి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ జిల్లా బాగుండాలని, యువతకు ఉద్యోగాలు రావాలని ఆయన ప్రారంభిస్తే, ఆయన అకాల మరణంతో అది ఆగిపోయింది. మరలా 2019లో వైయస్ జగన్  సీఎం అయిన తర్వాత 2019 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైనా, ఆ తర్వాత రూ.750 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించారు. రూ.8,800 కోట్లతో రెండు దశల్లో నిర్మాణ వ్యయంతో జేఎస్ డబ్ల్యూతో పనులు మొదలుపెట్టించారు. ఈ లోగా ఎన్నికలు రావడం, చంద్రబాబు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క అడుగు కూడా పనులు ముందుకు కదల్లేదు. కానీ ఇప్పుడు తానేదో కొత్తగా చేస్తున్నట్టు మరలా శంకుస్థాపన చేస్తానని చెప్పడం విడ్డూరం.

  చంద్రబాబు రాయలసీమ ద్రోహి: సాకే శైలజానాధ్, మాజీ మంత్రి

చంద్రబాబుకు కేవలం శంకుస్థాపనలు చేసే అలవాటు తప్ప, పనులు మొదలుపెట్టి పూర్తి చేసే అలవాటు అస్సలు లేదు. గతంలో హంద్రీ నీవా కు కూడా రెండుసార్లు శంకుస్థాపన చేసిన చరిత్ర ఆయనది. చంద్రబాబును చూస్తేనే భయం కలుగుతుంది. ఆయన రాయలసీమకు చేస్తున్న ద్రోహం చాలా దారుణం. రాయలసీమ నుంచి హైకోర్టును లాక్కెళ్లడమే కాకుండా, కడప నుంచి సహకార బ్యాంకును కూడా లాక్కెళ్లారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబును 'రాయలసీమ ద్రోహి'గానే చూస్తున్నారు. ఆయన మాటలు మాత్రమే రాయలసీమకు పరిమితం చేస్తారు, పనులు మాత్రం అమరావతికే చేస్తారు.
​కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు, దాన్ని త్వరగా పూర్తి చేయాలి. వైయస్ జగన్  హయాంలో అన్ని అనుమతులు తీసుకొచ్చి, కేంద్రం కూడా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత.. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పనులు నిలిపివేసింది. యాజమాన్యంపై కేసులు పెట్టి భయపెట్టి పనులు నిలిపివేయడానికి కారణం చంద్రబాబే. ఈ నెల 3న చంద్రబాబు మళ్లీ భూమిపూజ అని డ్రామాలు ఆడినా.. ఎవరు పూర్తి చేసినా ఆ క్రెడిట్ మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ లకే దక్కుతుంది. కడప ఉక్కు రాయలసీమ హక్కు అన్న సంగతి చంద్రబాబు మర్చిపోవద్దు.

Back to Top