తిరుపతి : తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలోని భూ వివాదంలో బాధిత వృద్ధ దంపతులకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ ఇన్‌చార్జి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు వనజా, ద్వారకానాథ్ రెడ్డి చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించిన ఆయన, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అవిలాల సర్వే నంబర్లు 176, 179లోని భూమి తమదేనని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జీవితాంతం కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన ఆస్తిని కబ్జా చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారని పేర్కొన్నారు. "మాకు చావే దిక్కు" అంటూ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు. మూడున్నర ఎకరాల భూమి కబ్జా వ్యవహారం వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు. ఈ అంశంపై పెద్దఎత్తున పోరాటం జరుగుతుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ వెన్నంటి ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధ దంపతుల తరఫున వాదిస్తున్న రిటైర్డ్ న్యాయమూర్తిని, అలాగే వైయస్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే నాని లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని భూమన మండిపడ్డారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి భాషను ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునే విషయమని అన్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి సంయమనం పాటించకుండా వ్యవహరించడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. చంద్రగిరి ప్రజలందరూ ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నారని, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన వారు వ్యక్తిగత దాడులకు దిగడం వారి వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు. బాధిత వృద్ధ దంపతులకు న్యాయం జరిగే వరకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం కొనసాగిస్తాయని, భూ కబ్జాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.