కర్నూలు జీజీహెచ్‌ నుంచి తొలగించిన పారిశుధ్య కార్మికులకు అండ‌గా ఉంటా

వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హామీ 

తాడేప‌ల్లి: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్‌) అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమను కొత్త కాంట్రాక్టర్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు జీజీహెచ్‌లో శానిటేషన్‌ పనుల కాంట్రాక్ట్‌ను పద్మావతి హాస్పిటాలిటీ ఏజెన్సీకి అప్పగించిన అనంతరం, ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మికులు తెలిపారు. దీంతో తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ, తమకు న్యాయం చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

వారి సమస్యలను ఓపికగా విన్న వైయస్‌ జగన్‌, ఉద్యోగాలు కోల్పోయిన పారిశుధ్య కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వారి ఉద్యోగాల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్‌ సెల్‌ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Back to Top