టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా టీ షాపు కేటాయింపు

 చైర్మన్ బీఆర్ నాయుడు అండతోనే అక్రమంగా దుకాణం ఏర్పాటు  

మాజీ టీటీడీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి 

తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉన్న ఆస్థాన మండపం ప్రాంగణంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి దుకాణం కేటాయించారని మాజీ టీటీడీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యక్ష పాత్ర ఉందని ఆయన విమర్శించారు.
బుధ‌వారం మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీవారి ఆలయం ముందు అత్యంత ప్రాధాన్యమున్న ఆస్థాన మండపం ప్రాంతంలో ఓ వ్యక్తికి టీ షాపు ఏర్పాటు చేసే అవకాశం కల్పించారని అన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి దుకాణాలకు అనుమతి లేదని టీటీడీ ఎస్టేట్ అధికారి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.

"అనుమతి లేదని అధికారులు చెబుతున్నప్పుడు అక్కడ దుకాణం ఎలా ఏర్పడింది? ఎవరి ఆదేశాలతో అది నడుస్తోంది?" అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అండదండలతోనే ఆ దుకాణం ఏర్పాటు జరిగిందని ఆరోపించారు. బీఆర్ నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ వ్యక్తి ఆయనకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నాడని, చైర్మన్ అభిప్రాయాలను ముందుగానే ప్రచారం చేసే వ్యక్తిగా మారాడని భూమన విమర్శించారు. చైర్మన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే రోజుకు భారీ ఆదాయం వచ్చే ప్రాంతంలో దుకాణం కేటాయించారని ఆరోపించారు.

టీటీడీ నిబంధనల ప్రకారం ఆ ప్రాంగణంలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయని, అయినప్పటికీ వాటిని పక్కనపెట్టి అడ్డదారిలో దుకాణం కేటాయించారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ యాజమాన్యం పూర్తి వివరణ ఇవ్వాలని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలలో జరుగుతున్న నిర్ణయాలపై భక్తులకు పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Back to Top