చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్‌

రాజధాని రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది?

ప్రెస్‌మీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్

తాడేపల్లి: ‘‘ఎక్కడా నైతిక విలువల్లేవ్‌.. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. జంగిల్‌రాజ్‌ అంటే ఎక్కడో బిహార్‌లో లేదు.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనే చంద్రబాబు పాలన రూపంలో కనిపిస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గత 18 నెలలుగా వరుసగా కొనసాగుతున్న అరాచకాలే అందుకు నిదర్శనమని అన్నారాయన. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు జంగిల్‌రాజ్‌పై ధ్వజమెత్తారు. 

బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్‌ టీంను ఏర్పాటు చేశాం. రైతుల ఆహ్వానం మేరకు వాళ్లు అక్కడ పర్యటించబోయారు. అయితే.. టీడీపీ గూండాలు వాళ్లను అడ్డుకుని దాడులు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు భౌతిక దాడులు చేశారు. దాడిలో ఓ కానిస్టేబుల్‌కు సైతం గాయాలయ్యాయి. 

టీడీపీ గూండాలే ఆ దాడి చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి.(లోకేష్‌తో దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు దిగిన ఫొటోలను వైఎస్‌ జగన్‌ ప్రదర్శించారు..) ఆశ్చర్యకరంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులైన వైఎస్సార్‌సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. 

ఈ అల్లర్లలో ఒక్క టీడీపీ నేతను అరెస్ట్‌ చేయలేదని.. చంద్రబాబు పాలన తీరుకు నిదర్శనమని జగన్‌ అన్నారు. బాధితులకే నిందలు మోపడం, వారిపైనే కేసులు పెట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

భూమి ఇవ్వని రైతులను భూసేకరణపేరుతో వేధిస్తున్నారు. కొడవీటి వాగును బలవంతంగా రైతుల పొలాల్లోకి తరలించారు.  రాజధాని ప్రాంత రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది? ఇంకా భూముల అవసరం ఏముంది?. భూములు లాక్కుని ఎందుకు వెళ్లగొడుతున్నారని రైతులు అడుగుతున్నారు?. రైతులు పడే అవస్థలు బయటకు రావొద్దనే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారు. రైతులకే కాదు.. ఆయన పాలనలో ఎవరికీ రక్షణ లేదు. పశ్నిస్తే రౌడీ షీటర్లు అని ముద్ర వేస్తున్నారు. ఎన్టీఆర్‌ బతికే ఉంటే.. ఆయనకు ప్రశ్నించే సమయం ఉండి ఉంటే.. ఆయన్ని కూడా చంద్రబాబు రౌడీ షీటర్‌ అనేవారేమో. విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు. వైఎస్‌ జగన్‌ అన్నారు.

Back to Top