విజయవాడ: లెనిన్ సెంటర్‌లో చిరు వ్యాపారుల దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులను బెదిరించి, దుకాణాలను తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన దుకాణాలను వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్లాది విష్ణు, మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా, కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. షాపులు తీసేస్తే లెనిన్ సెంటర్ మరో జంతర్‌మంతర్ అవుతుంది: మల్లాది విష్ణు లెనిన్ సెంటర్‌లో చిరు వ్యాపారులను ఆరు నెలలుగా కమిషన్ల కోసం వేధిస్తున్నారు. అధికారులు ఎమ్మెల్యే బోండా ఉమా చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. విజయవాడలో ఎంతోమంది పెద్ద వ్యాపారులు ఉన్నారు. వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు? వారి షాపులకు ఎందుకు కరెంట్ కట్ చేయించడం లేదు? పేద చిరు వ్యాపారులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? సాయంత్రానికల్లా కోటిన్నర రూపాయలు తీసుకురాకపోతే షాపులు తీసేస్తామని, బుల్డోజర్లతో కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది బుల్డోజర్ల ప్రభుత్వంగా మారిపోయింది. బుల్డోజర్లతో పేదల దుకాణాలు కూల్చే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారు? బెజవాడలో దళారుల రాజ్యం నడుస్తుంటే చంద్రబాబు, లోకేష్‌కు కనిపించడం లేదా? బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు లెనిన్ సెంటర్ వ్యాపారులపై పడ్డారు. కార్పొరేషన్‌లో జెండా ఎగరవేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. ఇలాంటి విధానాలతో ముందుకెళ్తే ప్రజలే మీ జెండా పీకేస్తారు. లెనిన్ సెంటర్‌లో షాపుల జోలికి వస్తే మేమేంటో చూపిస్తాం. షాపులను తొలగించాలని చూస్తే లెనిన్ సెంటర్ మరో జంతర్‌మంతర్‌గా మారుతుంది. రోజువారీ, నెలవారీ వసూళ్లతో జనాన్ని పీక్కుతింటున్నారు: దేవినేని అవినాష్ టీడీపీ నేతలు రోజువారీ, నెలవారీ వసూళ్లతో ప్రజలను పీక్కుతింటున్నారు. గతంలో ఎన్నడూ లెనిన్ సెంటర్‌లో చిరు వ్యాపారులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఇప్పుడు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఆస్పత్రులు, వైద్యులు, డయాగ్నస్టిక్ సెంటర్లను కూడా టీడీపీ నేతలు విడిచిపెట్టడం లేదు. డబ్బులు ఇవ్వనిదే భవనాలకు అనుమతులు రావడం లేదనే పరిస్థితి నెలకొంది. టౌన్ ప్లానింగ్ అధికారులు పచ్చ కండువాలు వేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పేదల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. లెనిన్ సెంటర్ చిరు వ్యాపారులకు వైయస్ఆర్‌సీపీ పూర్తి అండగా ఉంటుంది. చంద్రబాబు సంపద సృష్టి అంటే పేదలను పీడించడమేనా?: వెలంపల్లి శ్రీనివాసరావు నిన్న ఉదయం నుంచి లెనిన్ సెంటర్‌లో కాల్వగట్లపై ఉన్న దుకాణదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పేదలను ఇలా పీడించడానికి సిగ్గులేదా? చంద్రబాబు చెప్పే సంపద సృష్టి అంటే ఇదేనా? బోండా ఉమా లక్షలకు లక్షలు తీసుకుని చిరు వ్యాపారులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులను బెదిరించి భయపెడుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో జనరేటర్లు పెట్టి మరీ షాపులకు కరెంట్ అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న చంద్రబాబు, లోకేష్ ఇళ్లకు కరెంట్ ఎందుకు నిలిపివేయడం లేదు? పేద చిరు వ్యాపారుల దుకాణాలపైనే మీ ప్రతాపమా? రెడ్‌బుక్ పేరు చెప్పుకొని బోండా ఉమా విర్రవీగుతున్నారు. మా డిజిటల్ బుక్‌లో మీ లెక్కలన్నీ ఉన్నాయి. మీరు చేసిన వసూళ్ల లెక్కలన్నీ వడ్డీతో సహా వసూలు చేయిస్తాం. లెనిన్ సెంటర్‌లో చిరు వ్యాపారుల జోలికి వస్తే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు.