చీటర్లతో పోలీస్ బాస్‌ల భారీ డీల్స్

కూటమి పాలనలో రోజుకో స్కామ్

'వైట్ కాలర్ రౌడీలు'గా మారిన పోలీస్ బాస్‌లు

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర 

తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి 
వంగవీటి నరేంద్ర.

రూ.300 కోట్ల 'అద్వైత్'స్కామ్‌ను రూ.53 లక్షలకు కుదించిన బెజవాడ పోలీస్ బాస్

"సాయికృష్ణ లాకప్ డెత్ లో సీసీ ఫుటేజ్ మాయం.

కూటమి ప్రభుత్వంలో పతనమైన లా అండ్ ఆర్డర్

వంగవీటి నరేంద్ర స్పష్టీకరణ 

​తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టిందని, రక్షించాల్సిన పోలీసులే ఇల్లీగల్ స్కామ్‌లలో భాగస్వాములవుతూ 'వైట్ కాలర్ రౌడీలు'గా మారిపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెజవాడ పోలీస్ బాస్ నీడలో జరిగిన రూ.300 కోట్ల అద్వైత్ ట్రేడింగ్ కుంభకోణం డీలింగ్స్‌ను, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పోలీసుల అక్రమాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు.  ప్రభుత్వంలో  పై స్దాయిలో పెద్దలు ఎలా ఉంటే కింద పోలీస్ యంత్రాంగం కూడా అదే స్థాయిలో అవినీతికి ఒడిగడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో రోజుకో స్కామ్ బయటపడుతుంటే, దాని వెనుక పోలీసుల హస్తం ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా మరియు ఆందోళనకరంగా మారింది. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ పోలీసులపై ఇలాంటి ఘోరమైన ఆరోపణలు వినలేదు.

- సాయికృష్ణ లాకప్ డెత్ – సీసీ టీవీ ఫుటేజ్ మాయం..

లాకప్ డెత్‌కు గురైన సాయికృష్ణ కేసే ఇందుకు సజీవ నిదర్శనం. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్‌లో కనీసం రెండు సంవత్సరాల పాటు సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆ ఫుటేజ్‌ను మాయం చేశారు. మరోవైపు క్రాంతి కుమార్ కేసులో కూడా లా అండ్ ఆర్డర్ లో జరుగుతున్న అవకతవకలపై కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీపీ, హోంమంత్రి లేదా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన దాఖలాలు లేవు. 

- రూ.300 కోట్ల అద్వైత్ ట్రేడింగ్ స్కామ్.. పోలీసుల భారీ డీల్..

ఇవాళ రాష్ట్రంలో మరో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గతేడాది జూన్ లో దాదాపు 1500 మంది బాధితులు 'అద్వైత్ ట్రేడింగ్ కంపెనీ' లో ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మించి తమను మోసం చేశారని, బోర్డు తిప్పేసిందని ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.300 కోట్లకు సంబంధించిన ఈ భారీ స్కామ్‌పై విజయవాడకు చెందిన ఒక ఉన్నత పోలీస్ అధికారి ఆ కంపెనీ డైరెక్టర్లను పిలిపించి మాట్లాడారు. ఆర్బీఐ నిబంధనలు లేకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండా అనధికారికంగా డిపాజిట్లు సేకరించడం చట్టరీత్యా నేరమని మరియు శిక్షార్హమని చెప్పిన సదరు అధికారి, ఆ తర్వాత వారితో ఒక భారీ డీల్ కుదుర్చుకున్నారు. 

- కేసును నీరుగార్చిన 'బెజవాడ బాస్'..

ఈ డీల్ కారణంగా రూ. 300 కోట్ల బోర్డు తిప్పేసిన కేసు పూర్తిగా పక్కకు పోయింది.   నిజానికి ఈ కేసులో సీఐడీ దర్యాప్తుతో పాటు, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రంగంలోకి దిగి ఆస్తులను జప్తు చేయాల్సి ఉంది. కానీ, దాదాపు 1500 మంది ఇచ్చిన ఫిర్యాదులను ఒకే ఒక్క ఫిర్యాదుగా మార్చేశారు. రూ. 300 కోట్ల స్కామ్‌ను కేవలం రూ. 53 లక్షలకు కుదించి, మొత్తం వ్యవహారాన్ని పోలీసుల కనుసన్నల్లోనే ముగించేశారు.
మసిపూసి మారేడు కాయ చేసిన ఆ 'బెజవాడ బాస్' అనే బిగ్ పేరు త్వరలోనే బయటకు వస్తుంది. గతంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, అగ్రిగోల్డ్ కేసులో కానీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. మరి ఈ రూ.300 కోట్ల స్కామ్ వివరాలను ఎందుకు ప్రజల ముందు ఉంచడం లేదు? గతేడాది జూన్ లో కేసు నమోదైతే ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?. 

- ప్రజలే నిర్ణయించాలి...

రక్షించాల్సిన పోలీసులే ఇలా అక్రమాలకు పాల్పడుతూ, ప్రజలను మోసం చేసే చీటర్లతో చేతులు కలిపి భక్షించే స్థాయికి దిగజారడం దారుణం. వీరిని వైట్ కాలర్ డెకాయిట్స్ (తెల్ల చొక్కా దోపిడీదారులు) అనాలా?. వైట్ కాలర్ గుండాలుగా మారిపోయారా? లేక వైట్ కాలర్ రౌడీలుగా మారిపోయారా? అనేది రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి" అని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.

Back to Top