మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

జైన్ ఫ్యాక్టరీ వద్ద వైయస్ఆర్‌సీపీ భారీ నిరసన 

చిత్తూరు : గంగాధర నెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులకు మద్ధతుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని మామిడి రైతుల పక్షాన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, వైయస్ఆర్‌సీపీ చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎం.సి. విజయానందరెడ్డి, కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్, పార్టీ నేతలు పృధ్విరెడ్డి, సునీల్ తదితరులు పాల్గొని మామిడి రైతులకు మద్దతు ప్రకటించారు.  చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో మామిడి రైతులకు ఒరిగిందేమీ లేదని, సీఎం సొంత జిల్లాలోనే అన్నదాతల కళ్లల్లో రక్తం చిందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధర కేజీ రూ.17.50 కల్పించాలని డిమాండ్‌ చేశారు. 
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏమన్నారంటే... 

● ఫ్యాక్టరీల యజమానులతో ప్రభుత్వం కుమ్మక్కు.. పోలీసులతో అణచివేత
- భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్. 

రాయలసీమ వ్యాప్తంగా 15 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి చేసిన రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం కేజీ రూ.17.50 చొప్పున కొనుగోలు చేస్తుంటే.. ఇక్కడ రైతు ద్రోహి చంద్రబాబు మాత్రం కిలోకి కేవలం రూ.4-5 మద్దతు ధర ప్రకటించి ముష్టి వేసినట్లు చూస్తున్నారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీల యజమానులు కుమ్మక్కై రైతుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2 లక్షల టన్నుల మామిడి నేలపాలైంది. లారీల్లో తెచ్చిన నాణ్యత లేదన్న సాకుతో  సరుకులో సగం వెనక్కి పంపుతున్నారు. ఇవాళ మా నిరసనను అడ్డుకోవడానికి పోలీసులు దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లను వెనక్కి పంపించేయడం దారుణం. పోలీసులతో ఎంత అణచివేసినా వెనకడుగు వేసేది లేదు.

● రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల రైతులను మోసం చేస్తున్నారు
- నారాయణస్వామి (మాజీ మంత్రి).

చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో అమరావతి రైతులనే కాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులను మోసం చేస్తోంది. కులాల మధ్య విభజన తెచ్చి పబ్బం గడుపుకుంటున్నారు. రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి, గిట్టుబాటు ధర లభించే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల వెంటే ఉండి అండగా పోరాడుతుంది.

● మామడి ధర రవాణా, కూలీ ఖర్చులకే సరిపోతోంది:
-  ఎం.సి. విజయానందరెడ్డి (చిత్తూరు ఇన్‌ఛార్జ్).

మామిడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధర కేజీకి రూ.17.50 ఉండాలి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ధర లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. మూడు దఫాలు దుక్కులు, మూడుసార్లు మందులు కొట్టాలి. కోత ఖర్చులు, ఫ్యాక్టరీలకు సరుకు రవాణా చేసే ట్రాక్టర్లకే కనీసం రూ.1500 ఖర్చవుతోంది. ఫ్యాక్టరీల వద్ద మూడు, నాలుగు రోజుల పాటు సరుకు దిగుమతి చేసుకోకపోవడంతో రోజుకు రూ.800 నుంచి రూ.1000 వరకు అదనంగా ట్రాక్టర్ అద్దె చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా 4 టన్నుల దిగుబడి వస్తే.. అందులో రెండున్నర టన్నుల ఆదాయం రవాణా, కూలీలకే సరిపోతోంది. రైతులకు ఏమీ మిగలడం లేదు. కూటమి పాలనలో రైతులకు ఉరేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది.

● వైయస్. జగన్ హయాంలో రాజుల్లా బతికిన రైతులకు నేడు దయనీయ స్థితి:
 - కృపాలక్ష్మి (జీడీ నెల్లూరు ఇన్‌ఛార్జ్).

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తోతాపురి రకానికి కనీస ధర రాక రైతులు కిలో రూ.4 నుండి రూ.7 లకే అమ్ముకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద టోకెన్ సిస్టం పేరిట నచ్చిన వాళ్లకు టోకెన్లు ఇస్తూ, మిగిలిన రైతులను రోజుల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారు. దీనివల్ల ట్రాక్టర్ల అద్దెలు పెరిగి రైతులు ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. వైయస్ జగన్ గారి హయాంలో తోతాపురి మామిడి ధర కేజీ రూ.25 తగ్గకుండా అందించి రైతులను రాజుల్లా చూసుకుంటే.. నేడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది.

● సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతుల కళ్లల్లో రక్తం:
- డాక్టర్ సునీల్ (మాజీ ఎమ్మెల్యే, పూతలపట్టు).

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికొచ్చిన పంట కుళ్లిపోతుండటంతో గత్యంతరం లేక కిలో రూ.2-3 లకే అమ్ముకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా రాక అన్నదాతల కళ్లల్లో రక్తం చిందుతోంది. సీఎం చంద్రబాబుకు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడుకు, స్థానిక ఎమ్మెల్యేకు రైతుల కష్టాలు పట్టడం లేదు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారీ రైతులకు కష్టాలు తప్పవు. రైతులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపదు.

Back to Top