ఒకే ప్రాజెక్టుకు ఎన్నిసార్లు శిలాఫలకాలు వేస్తారు?

వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్‌ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి సూటి ప్ర‌శ్న‌

చిత్త‌శుద్ధి ఉంటే పరిశ్రమ పూర్తి చేసి యువతకు ఉద్యోగాలు ఇవ్వండి 

కడప స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ సవాల్ 

వైయ‌స్ఆర్ జిల్లా: ఈవీఎంల సాయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతోనే కాలం గడుపుతోందని వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్‌ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో పదేపదే శంకుస్థాపనలు చేయడం తప్ప, పనులను పూర్తి చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి ఆయన మాట్లాడారు.

ఏడాది క్రితం జరిగిన మహానాడులో వారంలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించిన కూటమి నాయకులు, ఏడాదిన్నర గడిచినా ఎలాంటి పురోగతి చూపలేదని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మళ్లీ జూలై 3న శంకుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఒకే ప్రాజెక్టుకు ఎన్నిసార్లు శిలాఫలకాలు వేస్తారని ప్రశ్నించారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కోసం 10 వేల ఎకరాల భూమిని కేటాయించారని గుర్తు చేశారు. అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియాతో ప్రచారం చేసి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌ కడప జిల్లా అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఎప్పటినుంచో నిర్లక్ష్య ధోరణి ఉందని, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

2018లో ఎన్నికల ముందు కంబాలదిన్నెలో ఇదే స్టీల్ ప్లాంట్‌కు శిలాఫలకం వేసిన చంద్రబాబు, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుని మూడు వేల ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అవసరమైన అన్ని అనుమతులు సాధించారని తెలిపారు. అనంతరం జిందాల్ సంస్థను తీసుకొచ్చి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారని చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత జిందాల్ సంస్థపై వేధింపులు పెరిగాయని, సంస్థ యాజమాన్యాన్ని కూడా ఇబ్బందులకు గురిచేసే స్థాయికి వెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అదే సంస్థతో మరోసారి శంకుస్థాపన చేయడం పాత సీసాలో కొత్త సారాను పోసినట్లేనని ఎద్దేవా చేశారు. పనులు పూర్తి చేయకుండా శంకుస్థాపనలతో కాలయాపన చేయడం మానుకుని, త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయ శైలి శిలాఫలకాలు వేసి వదిలేయడమేనని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టుకు రెండు మూడు సార్లు శంకుస్థాపనలు చేయడం ఆయనకు అలవాటైందన్నారు. ఎన్నికలు సమీపించినప్పుడల్లా శిలాఫలకాల రాజకీయాలు గుర్తుకు వస్తాయని, తాను చేయకపోగా ఇతరులు చేయనివ్వని ధోరణి చంద్రబాబుదని ఆరోపించారు. రాయలసీమలో జన్మించినప్పటికీ ఆ ప్రాంత అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఆసక్తి లేదని, ఆయన ఆలోచన అంతా ఓట్లు, సీట్లు చుట్టూనే తిరుగుతుందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు సీఎం రమేష్‌తో నిరాహార దీక్షలు చేయించి కంబాలదిన్నెలో శిలాఫలకం వేసిన విషయం ప్రజలకు గుర్తుందని అన్నారు. వైయ‌స్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి జిందాల్ సంస్థకు ప్రాజెక్టును అప్పగించిందని చెప్పారు.

ప్రభుత్వం మారిన తర్వాత జిందాల్ సంస్థపై నమోదైన కేసులు, ఎదురైన ఇబ్బందులను ప్రజలు చూశారని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడానికి సిద్ధమవడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. నామ్‌కే వాస్తే శిలాఫలకాలు వేయడం కాకుండా, ప్రాజెక్టును పూర్తిచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతల బృందం సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
 

Back to Top