మల్లయ్య కొండపై మైనింగ్‌కు ‘పచ్చ’ జెండా..

భక్తుల మనోభావాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలు!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం

మల్లయ్యకొండ, సాదుకొండ, ఎర్రకొండల్లో మైనింగ్‌కు కూటమి ప్రభుత్వం యుద్ధ‌ప్రాతిపాదిక‌న‌ అనుమతులు

భక్తుల మనోభావాలను గౌరవించి వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో నిలిచిపోయిన మైనింగ్‌కు మళ్లీ ఊతం

2022లో అనుమతులు వచ్చినా జగన్ జోక్యంతో మైనింగ్ ప్ర‌క్రియ నిలిపివేత‌

2015లో ప్రాస్పెక్టింగ్ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే

ముక్కంటి కొండలను కాపాడేందుకు ప్రజలు, భక్తులు ఉద్యమాలకు సిద్ధం

కూట‌మి ప్ర‌భుత్వాన్ని  హెచ్చ‌రించిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

సూపర్ సిక్స్ హామీలపై చూపని వేగం మైనింగ్ విషయంలో ఎందుకు

పవిత్ర శైవక్షేత్రం, రిజర్వ్ ఫారెస్ట్‌పై మైనింగ్ ప్రభావంపై స్థానికుల్లో ఆందోళన

మైనింగ్ నిలిపివేయకపోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం తప్పదు

ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

తిరుపతి:  అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండ సముదాయంలో భాగమైన సాధుకొండ, శివపురం కొండల్లో ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌కు కాంపోజిట్‌ లైసెన్సుల కోసం చంద్రబాబు ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) జారీ చేసిందని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మరోవైపు సమీపంలోని శివపురం ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ను ప్రైవేట్‌ సంస్థకు కేటాయించడం ద్వారా మొత్తం ప్రాంతాన్ని మైనింగ్‌ జోన్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మంగ‌ళ‌వారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పవిత్ర ముక్కంటి కొండల్లో మైనింగ్‌కు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ధ్వ‌జ‌మెత్తారు.
ప్రెస్‌మీట్‌లో పెద్దిరెడ్డి రామ‌చంద్రార‌రెడ్డి ఏమ‌న్నారంటే..

- నాడు దుష్ప్ర‌చారం

ఎన్నికల సమయంలో మల్లయ్యకొండ, ఎర్రకొండ, సాదుకొండలను వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మైనింగ్ చేసి దోచేస్తుందని టీడీపీ విషప్రచారం చేసింది. అయితే వాస్తవానికి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వైయస్ జగన్ ప్రభుత్వం మైనింగ్‌కు ముందుకు వెళ్లలేదు. దేవాలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణకు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

- నాడు కేంద్రం అనుమతులు ఇచ్చినా వైయస్‌ జగన్‌ నిలిపివేశారు

2022లో ఎర్రకొండలో మైనింగ్‌కు కేంద్ర అనుమతులు వచ్చినప్పటికీ, మల్లయ్యకొండపై ప్రసిద్ధ ఆలయం ఉండటంతో మైనింగ్ చేపట్టకూడదని శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి వివరించగా వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు.  సాదుకొండలో మైనింగ్ కోసం 2004 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రాస్పెక్టింగ్ లైసెన్సులు జారీ అయ్యాయి. (ఇందుకు సంబంధించిన జీవోలను మీడియాకు చూపించిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి).

- నేడు యుద్ధప్రాతిపదికన జీవోలు జారీ

ప్రస్తుతం సాదుకొండ, శివపురం, ఎర్రకొండ ప్రాంతాల్లో మైనింగ్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. యుద్ధ‌ప్రాతిపాదిక‌న జీవోలు విడుద‌ల చేసింది. ఏప్రిల్ 23న ఒక ప్రాజెక్టుకు, మార్చి 30న మరో ప్రాంతానికి అనుమతులు జారీ చేశారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో కనిపించని తాపత్రయం మైనింగ్ విషయంలో ఎందుకు కనిపిస్తోంది?

- ఏ కొండను తాకినా ప్రతిఘటన త‌ప్ప‌దు

మల్లయ్యకొండ సముదాయం రాయలసీమలో అత్యంత పవిత్ర శైవక్షేత్రం, తిరుమలకు ఏడు కొండలు ఎంత పవిత్రమో మల్లయ్యకు చెందిన మూడు కొండలు కూడా అంతే పవిత్రమని భక్తులు భావిస్తారు. అలాంటి ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమే. ముక్కంటి కొండల్లో ఏ కొండను తాకినా ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెంటనే మైనింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమం చేపడుతుందని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Back to Top