తిరుపతి జిల్లా : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ ఇసుక, మట్టి రవాణా అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోందని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళి మృతి చెందిన ఘటనపై శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే, మృతుడి సోదరుడు గోపి గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గ పర్యటనలోనే ఉన్నప్పటికీ, ఇసుక మాఫియా కారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయినా కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు. ఇటీవల తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళి కూడా మట్టి మాఫియా కారణంగా మృతి చెందడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. అక్రమ ఇసుక, మట్టి రవాణాపై ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ వరుస విషాదాలకు కారణమని ఆరోపించారు. మృతుడు మురళి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే శ్రీకాళహస్తిలో ఇసుక, మట్టి మాఫియా కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక, మట్టి మాఫియాపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబాలకు అండగా వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో భారీ స్థాయిలో ధర్నాలు, ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ మాఫియాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.