కందుకూరు: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని, లేదంటే ప్రజలతో కలిసి ఎంతటి పోరాటానికైనా వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంటుందని కందుకూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామాయపట్నం పోర్టు విషయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3,743 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించి, దాదాపు 90 శాతానికి పైగా పూర్తి చేశారని తెలిపారు. 850 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ పోర్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, పరిశ్రమల ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించారని గుర్తుచేశారు. పోర్టులో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దాదాపు పూర్తయిన ప్రభుత్వ ఆస్తిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. రూ.5 వేల కోట్లకు పైగా విలువైన పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే 50 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ఏపీ మారిటైమ్ బోర్డు బిడ్లు ఆహ్వానించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గౌరవిస్తూ రామాయపట్నం పోర్టును ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్మించిన కీలక మౌలిక సదుపాయాలను ప్రైవేటుపరం చేయడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న **'ఛలో రామాయపట్నం'** కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, మేధావులు, మహిళలకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ ఉద్యమంలో కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.