'జగన్ 2.0 సూపర్ యాప్'తో ప్రతి కార్యకర్తకు పార్టీ అండ

 డిజిటల్ వేదికగా కార్యకర్తలకు భరోసా కల్పించే వినూత్న యాప్: డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి 

 నెల్లూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధికారిక  'జగన్ 2.0 సూపర్ యాప్‌`ను మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తొలగించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనతో ఈ సొంత డిజిటల్ వేదికను రూపొందించినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి, పార్టీతో నేరుగా అనుసంధానమై ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒకే వేదికపై అనుసంధానమవుతారని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, కార్యకర్తల ఇబ్బందులు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తక్షణమే పార్టీ నాయకత్వానికి చేరేలా ఈ యాప్ పనిచేస్తుందని వివరించారు.

పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు డిజిటల్ డైరీ ద్వారా నేరుగా ఫిర్యాదులు నమోదు చేసే సౌకర్యాన్ని కూడా ఈ యాప్‌లో కల్పించామని చెప్పారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలపై వచ్చే అభ్యంతరకర పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే ప్రయత్నాలతో పాటు, పార్టీ కార్యకర్తల కోసం ఎవరూ అడ్డుకోలేని స్వంత డిజిటల్ వేదికగా  'జగన్ 2.0 సూపర్ యాప్` రూపొందించబడిందని డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త నిత్యం పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటూ, పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా పాల్గొనే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.
 

Back to Top