రైతులను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు 

 రైతు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ 

 ప్రకాశం: రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని, ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ప్రభుత్వం అంటే బాధ్యతతో వ్యవహరించే వ్యవస్థ కావాలని, కానీ ప్రస్తుతం ప్రజలను మోసం చేయడమే పాలనగా మారిందని విమర్శించారు. రైతుల నుంచి అతి తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి, అదే వస్తువులను వినియోగదారులకు అనేక రెట్లు అధిక ధరలకు విక్రయించే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించే బదులు వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
 

Back to Top