తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక 20 మంది దళితులను చంపేసినా ఆమె నుంచి కనీస స్పందన కూడా లేదని మండిపడ్డారు. ఒక దళిత మహిళగా కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. విజయవాడలోనే ఉంటూ సినిమా ఫంక్షన్లకు, క్రికెట్ ఈవెంట్లకు హాజరవుతున్న హోంమంత్రి అనిత, తోటి దళిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడానికి కూడా తీరిక లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 70 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పిన అనిత, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. పేరోల్స్, వీఆర్ లో ఉన్న సీఐలకు పోస్టింగులు, కేసులు మాఫీ చేసి కాసులు కూడబెట్టుకోవడం మీద పెట్టిన శ్రద్ధ ఇకనైనా మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలని నాగమల్లేశ్వరి హితవు పలికారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. వైయస్ఆర్‌సీపీనాయకులు, మాజీ మంత్రుల కార్ల మీద టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా హోంమంత్రి అనిత నుంచి స్పందన లేదు. చంద్రబాబు ఆదేశిస్తే వైయస్ జగన్ గారిని తిట్టడానికి మాత్రమే ఆమె మీడియా ముందుకొస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంతో మంది మహిళలపై అఘాయిత్యాలు చేసినా ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించి నిందితులను కఠినంగా శిక్షించి అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చిన పాపానపోలేదు. ఒక దళిత మహిళగా కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయడానికి ముందుకు రాలేదు. విజయవాడలోనే ఉంటూ తోటి దళిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడానికి కూడా ఆమె తీరిక లేకుండా పోయిందా? 70 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పిన అనిత, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అవన్నీ ఏమయ్యాయి? టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ వరకు తీసుకొస్తే ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయలేదా? పేరోల్స్, వీఆర్ లో ఉన్న సీఐలకు పోస్టింగులు, సాయికృష్ణ లాంటి కేసులు మాఫీ చేసి కాసులు కూడబెట్టుకోవడం తప్ప హోంమంత్రి అనితకి ఏం తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీస్ వ్యవస్థ పనితీరు పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. హోంమంత్రి అనిత పనితీరు కారణంగా పోలీస్ వ్యవస్థ ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. రాష్ట్రంలో మహిళలపై గంటకు నాలుగు దారుణాలు జరుగుతున్నాయని గతంలో హోంమంత్రి స్వయంగా చెప్పారు. సినిమా ఫంక్షన్లకు, క్రికెట్ ఈవెంట్లకు వెళ్లడానికి ఉన్న టైమ్, శ్రద్ధ మహిళలపై దారుణాలు జరిగితే స్పందించడానికి ఉండటం లేదా? కూటమి ప్రభుత్వం వచ్చాక 20 మంది దళితులను చంపేసినా ఆమె నుంచి కనీస స్పందన కూడా లేదు. మహిళా కమిషన్ ఉన్నది మహిళల్ని అడ్డుకోవడానికా? వైయస్ జగన్ గారిని, ఆయన తల్లి, భార్యతోపాటు వైయస్ఆర్‌సీపీ నాయకులను ఉద్దేశించి హోంమంత్రి అనరాని మాటలతో రెచ్చిపొయింది. మాజీ మంత్రి అనే గౌరవం లేకుండా గుడివాడ అమర్నాథ్ గారిని ఉద్దేశించి వాడు, నంగనాచి అంటూ నోరుపారేసుకుంది. తప్పులన్నీ చేసి దళిత కార్డు మహిళ కార్డును వాడేయడం అలవాటుగా మార్చుకుంది. ఆయన రెస్పాండ్ కాగానే కేసులు పెట్టించింది. మహిళా కమిషన్‌కి వెళితే పెద్ద పెద్ద రోప్‌లు, భారీగా పోలీసులను మోహరించి లోపలికి రాకుండా మహిళలనే అడ్డుకున్నారు. అలాంటప్పుడు మహిళా కమిషన్ ఉన్నది దేనికి? సంపాదన మీద తప్ప హోంశాఖలో ఏం జరుగుతుందో కూడా ఆమెకు అవగాహన లేదు. అధికార మదంతో హోంమంత్రి మాట్లాడిన ప్రతి మాటకూ రాబోయే రోజుల్లో తప్పక సమాధానం చెప్పి తీరాలని గుర్తుపెట్టుకోవాలి. ఇతరులకు నీతులు చెప్పే ముందు, మనం పాటిస్తున్నామా అని ఆలోచించాలి. బిడ్డని కోల్పోయిన తల్లుల ఆవేదన ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు.