క్రాంతికుమార్‌ కుటుంబానికి అండగా ఉంటాం

న్యాయం జరిగేలా అవసరమైతే పోరాడతాం

శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన

క్రాంతికుమార్‌ కుటుంబం కడు పేదరికంలో ఉంది

ఒక అమాయకుణ్ని వేధించి, కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు

రాష్ట్రంలో దిగజారిన పోలీస్‌ వ్యవస్థకు ఇది నిదర్శనం

ఇంత జరిగినా, ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు

శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

విజయవాడ: కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు, పోలీసుల వేధింపులు తాళలేక, సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం మాదిరిగా అన్ని వివరాలు చెప్పి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ కుటుంబాన్ని శ్రీ వైయస్‌ జగన్‌ పరామర్శించారు. విజయవాడ, కృష్ణలంకలో ఉన్న క్రాంతికుమార్‌ ఇంటికి వెళ్లిన శ్రీ వైయస్‌ జగన్, ఆయన భార్య, పిల్లలు, తండ్రిని కలిసి ఓదార్చారు. పోలీసులు క్రాంతికుమార్‌ను ఏ విధంగా వేధించారనేది చెప్పిన వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పిన శ్రీ వైయస్‌ జగన్, ఆ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
ఆయ‌న‌ ఇంకా ఏమన్నారంటే..:
రాష్ట్రంలో దిగజారిన పోలీస్‌ వ్యవస్థ:
    క్రాంతికుమార్‌ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఇక్కడ హృదయ విదారకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. అందరూ కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. చాలా పేదరికంలో బతుకుతున్న వారిని, ఈ వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది. క్రాంతికుమార్‌ ఒక టాక్సీ డ్రైవర్‌. 8 ఏళ్ల క్రితం ఏవో చిన్న కేసులు ఉంటే, వాటిని కూడా కొట్టేశారు. శిక్ష కూడా పడలేదు. అయినా క్రాంతికుమార్‌ను రోజూ పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని 3 నెలలు వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ స్థాయికి పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయింది.
    తనకు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు. ముగ్గురు చిన్న పిల్లలు.
క్రాంతికుమార్‌ ఏ నేరం చేయకపోయినా, పోలీసులు ఎందుకు స్టేషన్‌కు పిలిపించారు. తనను 3 నెలల నుంచి రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించారని, హింసించారని క్రాంతికుమార్‌ తన మరణ వాంగ్మూలం (వీడియో రికార్డింగ్‌)లో చెప్పారు. పోలీసులు బలవంతపెట్టి తనతో చేయించకూడని పనులు చేయించారని ఆ వీడియోలో పేర్కొన్నాడు. 

అయినా ఏ చర్యా లేదు:
    ఇది రాజధాని విజయవాడలో జరిగింది. కూతవేటు దూరంలో సీఎం నివాసం, సీపీ ఆఫీస్‌ ఉంది. డీజీపీ ఆఫీస్‌ ఉంది. హోం మంత్రి ఆఫీస్‌ కూడా ఇక్కడే ఉంది. తన కొడుకు ఆత్మహత్య తర్వాత, ఆ వీడియోను ఆయన తండ్రి సీపీకి చూపినా, పట్టించుకోలేదు. ఏ చర్య తీసుకోలేదు. మరి తప్పు చేసిన వారిని ఎందుకు రక్షిస్తున్నారు. ఇక్కడ రాజధానిలో ఒక రాకెట్‌ నడిపిస్తున్నారు. సీఐ నాగరాజుకు సీపీ ప్రొటెక్షన్‌. సీపీకి డీజీపీ ప్రొటెక్షన్‌. డీజీపీకి సీఎం ప్రొటెక్షన్‌ ఇస్తున్నారు.

సీసీ టీవీ ఫుటేజ్‌ మాయం:
    ఒక నెల వ్యవధిలో రెండు మరణాలు, కృష్ణలంక పీఎస్‌ పరిధిలో. ఒకటి లాకప్‌డెత్‌. మరొకటి ఆత్మహత్య. అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా లేదు. పోలీస్‌ స్టేషన్లలో తప్పనిసరిగా ఉండాల్సిన సీసీ కెమెరా ఫుటేజ్‌ మాయమైపోయింది. ఒక రిమాండ్‌ రిపోర్టులో నెల రోజుల ఫుటేజ్‌ లేదన్నారు. మే 1 నుంచి జూన్‌ 1 వరకు లేదని. మరో దాంట్లో 18 నెలల నుంచి ఫుటేజ్‌ లేదన్నారు. ఎవరు పడితే వారు అలా సీసీ కెమెరాల ఫుటేజ్‌ తీసేయొచ్చా. మరి బ్యాకప్‌ ఉండదా?.
    అంటే ఒక పద్ధతి ప్రకారం పోలీస్‌ స్టేషన్లలో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. కొడుతున్నారు. చంపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. చెత్తబుట్టలో వేస్తున్నారు.

అండగా నిలబడతాం:
    ఇంత జరిగినా కేసు నమోదు చేయలేదు. నిజానికి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. ఈ కేసుకు సంబంధించి, న్యాయ సహాయం మొదలు, అన్ని రకాలుగా వారికి మా పార్టీ తరపున అండగా నిలబడతాం. వారికి న్యాయం జరిగేలా అవసరమైతే కోర్టులో కూడా పోరాడతామని శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు.

మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..:
    వాక్‌ స్వాతంత్య్రాన్ని దూషణలకు వాడితే చర్యలంటూ పవన్‌కళ్యాణ్‌ చేసిన ప్రకటనపై మీడియా ప్రశ్నించగా, శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..
    అది ఏ సందర్భంలో అన్నారో, ఎవరిని ఉద్దేశించి అన్నారో, ఎందుకు అన్నారో నాకు తెలియదు. కాకపోతే జర్నలిస్టులంతా గతంలో సోషల్‌ మీడియా వేదికగా ఏం జరిగిందనేది ఒకసారి చూడాలి. సోషల్‌ మీడియా వేదికగా దూషణలు, నిందలను ఆయా వర్గాలు విస్తృతంగా చేశాయి. దీన్ని మర్చిపోకూడదు.
    రూల్స్‌ అనేవి అందరికీ సమానంగా వర్తింపచేయాలి. వ్యవస్థలు అందరి విషయంలో సమానంగా పని చేయాలి. ఒకరిని ఒకలా, మరొకరిని ఇంకోలా కాదు. అలాంటప్పుడే సమతుల్యత ఉంటుందని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.

Back to Top