విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన స్వర్గీయ కొణిజేటి రోశయ్య 93వ జయంతి వేడుకలు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని త్రిమూర్తి చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు రోశయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది రోశయ్య జయంతి, వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రోశయ్య ఆదర్శప్రాయ నాయకుడని అన్నారు. పదవుల కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదని, పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా నీతి, నిజాయితీలతో ప్రజాసేవ చేసిన నాయకుడిగా ఆయన నిలిచిపోయారని కొనియాడారు. ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన రోశయ్య అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి సమర్థవంతంగా సమాధానాలు ఇచ్చేవారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అదే స్థాయిలో ప్రశ్నించేవారని వెలంపల్లి పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు రోశయ్య ప్రసంగాలను అధ్యయనం చేసి ఆయన సంయమనం, సభా మర్యాదలు, మాట్లాడే తీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులు, కూటమి నాయకులకు రోశయ్య అసెంబ్లీ ప్రసంగాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అధికార అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొందని వెలంపల్లి విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి అడిగినా, ప్రజా సమస్యలపై ప్రశ్నించినా సమాధానాలు చెప్పకుండా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 'రెడ్ బుక్ రాజ్యాంగం' అమలవుతోందని ఆరోపించారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా, రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ఒక్కరోజు కూడా ఓవర్‌డ్రాఫ్ట్ పరిస్థితి రాలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతిరోజూ ఓవర్‌డ్రాఫ్ట్ పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రోశయ్య చూపిన మార్గాన్ని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రోశయ్య ఆశయాలు, విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వెలంపల్లి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.