ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకే ఉపా చట్టం ప్రయోగం

ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి మద్దతు

రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం

విజయవాడ:   ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేసేందుకు ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. ప్రశ్న రావణ్‌పై నమోదు చేసిన ఉపా కేసు పూర్తిగా అన్యాయమని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఈ కేసుకు వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం నమోదు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉపా కేసు పూర్తిగా అన్యాయం.. అక్రమం
ప్రశ్న రావణ్‌పై నమోదు చేసిన ఉపా కేసు పూర్తిగా అన్యాయమని, అక్రమమని అంబ‌టి రాంబాబు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరాలను అణచివేసేందుకే ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రావణ్ భావజాలం తమ పార్టీ భావజాలం కాదని, ఆయన వైయ‌స్ఆర్‌సీపీని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా అన్యాయంగా చట్టాలను ప్రయోగించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.

బెయిల్ వచ్చిన ప్రతిసారీ కొత్త కేసులు నమోదు చేశారు

ఒక పోలీస్ స్టేషన్‌లో బెయిల్ వచ్చిన వెంటనే మరో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కొత్త కేసులు నమోదు చేశారని అంబటి రాంబాబు తెలిపారు. నాలుగు చోట్ల బెయిల్ లభించిన తర్వాత చివరకు ఉపా చట్టాన్ని ప్రయోగించి రిమాండ్‌కు పంపారని అన్నారు. రిమాండ్‌కు పంపిన తర్వాతే దర్యాప్తు ప్రారంభించి, ఉపా చట్టానికి అవసరమైన ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేయడం చట్ట దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. రావణ్ ఇంట్లో సోదాలు నిర్వహించడం కూడా అదే చర్యల్లో భాగమని పేర్కొన్నారు.

దాడి చేసిన వారిపై చర్యలు లేవు.. బాధితుడిపైనే కఠిన చట్టాలు

పోలీస్ స్టేషన్‌లో ఉన్న రావణ్‌పై గోడ దూకి దాడి చేసి హత్య చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించినా వారిపై కేసులు నమోదు చేయలేదని అంబటి రాంబాబు అన్నారు. కానీ అదే వ్యక్తిపై అత్యంత కఠినమైన ఉపా చట్టాన్ని ప్రయోగించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని విమర్శించారు.

అన్యాయాన్ని ప్రతిఘటించడం మా బాధ్యత

రావణ్‌పై అమలు చేసిన ఉపా చట్టానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి వైయ‌స్ఆర్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని అంబటి రాంబాబు ప్రకటించారు. భావజాల భేదాలు ఉన్నప్పటికీ, అన్యాయంగా చట్టాలను ప్రయోగించి ఎవరినైనా అణచివేయడాన్ని తమ పార్టీ ఎప్పటికీ సమర్థించదని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గమైన చర్యను ప్రజాస్వామ్య శక్తులందరితో కలిసి కచ్చితంగా ప్రతిఘటిస్తామని అన్నారు.

బాధితుల పక్షాన నిలబడటమే వైయ‌స్ఆర్‌సీపీ విధానం
సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణించినప్పుడు వారి కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలిచిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. కొందరు రౌడీషీటర్లకు మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారని, అయితే తమ పార్టీ ఎప్పుడూ రౌడీషీటర్లకు కాదు, అన్యాయానికి గురైన బాధితులకు మాత్రమే అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పోలీసుల హింసకు, అధికార దుర్వినియోగానికి బలైన వారి తరఫున నిలబడటం ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. 
 

Back to Top