నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

అద్దంకిలో పల్నాడు ఆసుపత్రి ప్రారంభం

ప్రకాశం జిల్లా : అద్దంకి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయ‌స్ఆర్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పల్నాడు ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు పల్నాడు ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, సిబ్బందితో అన్ని రకాల వైద్య సేవలను ఒకేచోట అందించేలా ఆసుపత్రిని తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డబ్బు లేకపోవడం వల్ల ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే సంకల్పంతో పేదలకు ప్రత్యేక రాయితీలు, ఆరోగ్య సేవలు అందిస్తామని తెలిపారు. అద్దంకి ప్రాంత జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా "జర్నలిస్ట్ ఆరోగ్య పథకం"ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఆరోగ్య కార్డులు అందజేసి, అవసరమైన వైద్య సేవలను ప్రత్యేక సౌకర్యాలతో అందిస్తామని చెప్పారు. పల్నాడు ఆసుపత్రి కేవలం ఒక వైద్యశాల మాత్రమే కాకుండా, ప్రజలకు నమ్మకమైన ఆరోగ్య భరోసాగా నిలవాలన్నదే తమ లక్ష్యమని, అద్దంకి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ అంకితభావంతో సేవలు అందిస్తామని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ స్పష్టం చేశారు.
 

Back to Top