మహిళలపై అఘాయిత్యాలను సహించేది లేదు

మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్ర‌హం

 వడ్డే చంద్రకళ పార్థీవ దేహానికి నివాళి

కళ్యాణదుర్గం : తెలుగుదేశం పార్టీ నాయకుడి వేధింపులు తాళలేక యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన వడ్డే చంద్రకళ సుదీర్ఘకాలం పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూయడం పట్ల వైయ‌స్ఆర్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యులు  తలారి రంగయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రకళ భౌతికకాయానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, గత ఒకటిన్నర సంవత్సరాలుగా చంద్రకళ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నరకయాతన అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చికిత్స కోసం గతంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మానవత్వంతో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచామని గుర్తు చేశారు. చంద్రకళను కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, నేడు ఆమె మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని తలారి రంగయ్య ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు రాజకీయ అండదండలు ఉండటంతో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల వల్లే చంద్రకళలాంటి మహిళలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందని, బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రకళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన తలారి రంగయ్య, ఆమె కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితురాలిని బలితీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత టీడీపీ నాయకుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

Back to Top