దేవుడి భూములు దేవుడికే చెందాలి.. 

క‌బ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

మాజీ మంత్రి తానేటి వనిత 

ఏలూరు:  ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలోని దేవాదాయ భూములను కబ్జాదారుల నుంచి రక్షించి, దేవుడి భూములు దేవుడికే చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర మాజీ హోంమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి  తానేటి వనిత నాయకత్వంలో పార్టీ నాయకులు ఏలూరు సంయుక్త కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ, తిమ్మాపురం గ్రామంలోని దేవాదాయ శాఖకు చెందిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవుడి ఆస్తులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, కబ్జాదారులను ఉపేక్షించడం వల్ల ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తాయని అన్నారు. దేవాదాయ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసి ఆలయానికి అప్పగించేలా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కైకలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్‌తో పాటు గోపాలపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top