గిరిజన మహిళపై దాడి అమానుషం.. 

బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కుంభ ర‌వి

కావలి: కావలి పట్టణంలోని 24వ వార్డు కచేరి మెట్ట ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళపై జరిగిన భౌతిక దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పార్టీ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన గిరిజన మహిళను పరామర్శించేందుకు కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి , ఎమ్మెల్సీ  కుంభ రవి , రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర తదితరులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అన్ని విధాలుగా పోరాడుతామని హామీ ఇచ్చారు.
కాకాణి, కుంభ‌ర‌వి మాట్లాడుతూ, గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత దారుణమని, మహిళలపై, ముఖ్యంగా గిరిజనులపై ఇలాంటి దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించడం ఎవరికీ తగదని, చట్టానికి అందరూ సమానమేనని స్పష్టం చేశారు.

అలాగే బాధితురాలిపై అక్రమ కేసులు నమోదు చేయడం, ఆమె గిరిజనురాలు కాదంటూ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం, వేరే మతానికి చెందిన మహిళగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమైన చర్యలని విమర్శించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసి, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని వారు పునరుద్ఘాటించారు.
 

Back to Top