దేవగుడిలో వైయ‌స్ఆర్ విగ్రహం ధ్వంసం.. 

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల ఆగ్రహం 

 వైయస్ఆర్‌ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన "చలో జిందాల్" కార్యక్రమం అనంతరం 
 వైయస్ఆర్ జిల్లా దేవ‌గుడి గ్రామంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి విగ్ర‌హాన్ని ప‌చ్చ‌మూక‌లు ధ్వంసం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్వగ్రామమైన దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది.

వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 1వ తేదీన నిర్వహించిన "చలో జిందాల్" కార్యక్రమంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, చెప్పుతో కొడతానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. 
ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే దేవగుడి గ్రామంలో ఉన్న వైయ‌స్ఆర్‌ విగ్రహం ధ్వంసం కావడం పలు అనుమానాలకు తావిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ప్రజల అభిమాన నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

ఈ ఘటన వెనుక ఉన్న బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విగ్రహ ధ్వంసం ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, భారీ సంఖ్యలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Back to Top