దేవగుడిలో వైయ‌స్ఆర్‌ విగ్రహం ధ్వంసం.. 

జమ్మలమడుగులో వైయస్ఆర్‌సీపీ శ్రేణుల ఆందోళ‌న‌

వైయస్ఆర్‌ జిల్లా :  జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ఆర్‌ విగ్రహం ధ్వంసం కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై  వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.
 వైయస్ఆర్‌సీపీ నాయకుల కథనం ప్రకారం, నిన్న సాయంత్రం నుంచే కూటమి నాయకులు వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నాలు చేశారు.  వైయస్ఆర్‌సీపీ కార్యాలయం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనాన్ని తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.
అంతకుముందు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసిందని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల అనంతరం రాత్రికి రాత్రే ఆదినారాయణరెడ్డి స్వగ్రామమైన దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం యాదృచ్ఛికం కాదని, దీని వెనుక కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు.

ఘటన విషయం తెలిసిన వెంటనే కడప పార్లమెంట్ సభ్యుడు వైయ‌స్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నాయకులు, కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని, ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని  వైయస్ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. కవ్వింపు రాజకీయాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. దేవగుడి ఘటనపై వెంటనే నిష్పాక్షిక విచారణ చేపట్టి, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని  వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పరిస్థితి దృష్ట్యా జమ్మలమడుగులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.


 

Back to Top