తాడేపల్లి: గ్రామీణ ఉపాధి హామీ కూలీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని, వేతనాల పెంపులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని, కేంద్రాన్ని ప్రశ్నించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా చేతులెత్తేశారని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్‌భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ (వీబీ జీ రామ్ జీ) పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ఉపాధి హామీ కూలీల హక్కులను కాపాడడంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రశ్నించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గ్రామీణ పేదల జీవనోపాధికి భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తూ, కూలీల ప్రయోజనాలను విస్మరించిన కూటమి ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో వెన్నపూస రవీంద్రారెడ్డి ఏమన్నారంటే.. - ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ రద్దుకు కూటమి ప్రభుత్వ విధానాలే కారణం గతంలో ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు భరించేది. ఇప్పుడు 60:40 విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలపై భారీ భారం మోపారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించడం, గ్రామీణ పేదలకు అందాల్సిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించడం వల్లే కేంద్రం విధానంలో మార్పులు తీసుకువచ్చింది. దీనికి బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదే. ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం గ్రామీణ కూలీలకు నిజమైన మేలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. - ఉపాధి కూలీలకు రూ.5 పెంపేనా? కేంద్రం ఇతర రాష్ట్రాల్లో ఉపాధి కూలీల వేతనాలను రూ.12 నుంచి రూ.66 వరకు పెంచగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం రూ.5 మాత్రమే పెంచడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఉపాధి కూలి రూ.89 పెరిగితే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లలో పెరిగింది కేవలం రూ.12 మాత్రమే. కేంద్రాన్ని ప్రశ్నించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారు. ఉపాధి కూలీల వేతనాల విషయంలో ఎల్లో మీడియా ఎందుకు మౌనం పాటిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలి. - మిగిలిన రూ.15,039 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్రంలో సుమారు 55 లక్షల యాక్టివ్ జాబ్ కార్డుదారులకు 125 రోజుల పని కల్పించాలంటే రూ.22,746 కోట్లు అవసరం. కేంద్రం నుంచి వస్తున్నది రూ.7,707 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.15,039 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. పంచాయతీల నిధుల దారి మళ్లింపుపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉపాధి హామీ కూలీల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు ప్రభుత్వం, కూటమి నాయకులకు సవాల్ విసురుతున్నామని వెన్నపూస రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.