మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి

మామిడి రైతులకు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన

చిత్తూరు జిల్లా: జీడీ నెల్లూరులో మామిడి రైతులకు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు శాంతియుతంగా ధర్నా చేస్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలను బలవంతంగా తరలించారు. పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. చిత్తూరు, జీడీ నెల్లూరు, పూతల పట్టు నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. మామిడి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్‌ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ ప్రశ్నించారు. మామిడి రైతులకు కిలో మద్దతు ధర 17 రూపాయలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్రం లక్ష 30 వేల టన్నులు తోతపూరి మామిడి కిలో 17.50 రూపాయలు చొప్పున కొనుగోలుకు అంగీకరించింది. చంద్రబాబుకు రైతులు పట్ల చిత్తశుద్ధి లేదు. వైయ‌స్‌ జగన్‌ పాలనలో తోతపురి మామిడి పంట 25 రూపాయలు ఏ రోజు తగ్గింది లేదు. గత ఏడాది మామిడి రైతులు పక్షాన వైయ‌స్‌ జగన్‌ పోరాటం చేశారు. చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి రైతులకు కిలో 17.50 రూపాయలు తీసుకురావాలి. మామిడి రైతులకు మేలు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ భూమన పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ ఎంపీ రెడ్డప్ప,  నాయ‌కులు విజయానంద రెడ్డి, కృపాలక్ష్మీ,  సునీల్,  పృథ్విరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ద్రాక్షాయ‌ణి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top