శునకానికి ఉన్న విశ్వాసంలో పదోవంతు కూడా బాబుకు లేదు

ఎన్టీఆర్‌ పైనుంచి రైతుల రూపంలో బాబుపై చెప్పులు వేయించారు

లోకేష్‌ రాజకీయ జీవితం ఆవిరైపోతుందనే చంద్రబాబు యాత్రలు

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: చంద్రబాబుకు శునకానికి ఉన్న విశ్వాసంలో పది శాతం కూడా లేదు. ఒక ముద్ద అన్నం పెడితే శునకం జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది. పిల్లనిచ్చి, పదవి, హోదా ఇచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఘనత చరిత్ర చంద్రబాబుదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. భగవంతుడు ఏ జన్మలో చేసిన పాపపుణ్యాలను ఆ జన్మలోనే అనుభవించేలా చేస్తాడని, వైశ్రాయ్‌ హోటల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబుపై అమరావతి రైతుల ఆవేశం, ఆక్రోశం రూపంలో ఎన్టీఆర్‌ పైనుంచి చెప్పులు వేయించాడన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అమరావతిలో రాజకీయ యాత్ర చేశాడన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ కీర్తి ముందు, మంచి పనుల ముందు తన కుమారుడు లోకేష్‌ రాజకీయ జీవితం ఎక్కడ ఆవిరి అయిపోతుందోనని భయంతో కేడర్‌ను కాపాడుకునేందుకు బాబు రాజకీయ యాత్ర చేశాడని అందరికీ తెలుసన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల పొలిటికల్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర రాజధానిలో ఒక రాజకీయ యాత్రను చేసి దాన్నేదో ఒక పెద్ద లక్ష్యసాధన కోసం.. దేశ చరిత్ర మార్చడం కోసమో.. యాత్ర చేసినట్లుగా చెప్పుకుంటున్నాడు. డబ్బులు ఇచ్చి మరీ దేశవ్యాప్తంగా చాలా కెమెరాలను తెచ్చుకొని అతను ఒక గొప్ప పోరాట యోధుడి కింద చిత్రీకరించే ప్రయత్నం చేసుకున్నారు. రాష్ట్ర వెలుపల వారికి బాబు పోరాటం, ధీరత్వం గురించి బాగా తెలుసు. నారా ఘన చరిత్ర గురించి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.

పాత రోజుల్లో సినిమాల్లోని విలన్లు రాజనాల, గుమ్మడి అదే రోజులు ఉన్నాయని, చచ్చు రాజకీయ ఎత్తుగడలతో, నక్కజిత్తులమారితత్వంతో ఏమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. 33 వేల ఎకరాల భూములను రైతులను త్యాగం నన్ను నమ్మి చేశారని మాట్లాడుతున్నాడు. వారిలో ఎన్నో ఆశలు కల్పించి, వారికి ఊహాజనితమైన కొత్త ప్రపంచాన్ని గ్రాఫిక్స్‌లో చూపించి మభ్యపెట్టారు. ఐదేళ్లు భూములు ఇచ్చి ఎదురుచూస్తే ఆ ఊహలను ఆవిరి చేశారు. సింగపూర్‌ కంటే, ఢిల్లీ కంటే, హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో అమరావతి నిర్మాణం చేస్తున్నానని ప్రజలను ఊరిస్తూ కాలం గడిపారు. ప్రజలను వంచన చేశాడు. లక్షా5 వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తానని చంద్రబాబు మాట్లాడారు. రైతులు నమ్మి పొలాలు ఇచ్చారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాల్లో అసైన్డ్‌ భూములు ఉన్న పేద రైతులను కూడా మీ పొలాలను ప్రభుత్వం లాక్కుంటుంది. మీరు అమ్ముకుంటే అమ్ముకోండి అని చెప్పి బెదిరించారు. మీ సొంత మనుషులను, ఏజెంట్లను పంపించి ఆ రైతుల నుంచి కొనుగోలు చేయించిన తరువాత జీఓ ఇచ్చి.. వారిని మోసం చేయకూడదనే చిత్తశుద్ధి ఉంటే.. రాజధాని ప్రకటించినప్పుడే అసైన్డ్‌ భూమిని కూడా పూలింగ్‌కు తీసుకుంటాం. వారికి స్థలం ఇస్తామని ఎందుకు చెప్పలేదు. అందరినీ మోసం చేసి లక్షా 5 వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తానని ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారు. అది కూడా అప్పు తెచ్చి 11 శాతం అంటే దాదాపు ప్రతి సంవత్సరం ప్రజల నెత్తి మీద రూ.570 కోట్లు వడ్డీ అయ్యేలా అప్పు తీసుకువచ్చారు.
చదరపు అడుగుకు రూ.12 వేలు ఇచ్చి తాత్కాలికంగా చాలీచాలని 6 బిల్డింగ్‌లు కట్టాడు. గొప్ప రాజధాని నిర్మించానని ఇవాళ అంటున్నాడు.

చంద్రబాబు, నారాయణను తిట్టుకోని వారు ఎవరైనా ఉన్నారా.. ఫొటోలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు. మొండిగోడలతో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను చూపిస్తూ రాజధాని అని చెప్పి ప్రజలను నమ్మమంటున్నారు.

చెప్పులు, రాళ్లతో వైయస్‌ఆర్‌ సీపీ దాడి చేయించిందని ఆరోపిస్తున్నాడు. భగవంతుడు ఎక్కడో ఉండడు. మనముందే ఉంటాడు. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను ఈ జన్మలోనే అప్పజెప్పుతాడు. మీకు రాజకీయ భవిష్యత్తు, భిక్ష పెట్టి హలో లక్ష్మణా అంటూ పదవి లేకుండా తిరుగుతుంటే పంచన చేర్చుకొని హోదా ఇచ్చి అధికారం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే పిల్లను ఇచ్చిన మామ అని చూడకుండా ఎంత క్రూరాతి క్రూరంగా వెన్నుపోటు పొడిచి.. ఆ మామ పదవి పోయి హోటల్‌ దగ్గరకు ఎమ్మెల్యేలను నా బొమ్మ పెట్టి గెలిచారని ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వస్తే కిరాయి గాళ్లతో చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది.

ఒక ముద్ద కుక్కకు పెడితే అది జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది. అటువంటి రామారావు నుంచి ఇన్ని పొందిన మీరు కుక్కకున్న విశ్వాసంలో పది శాతం కూడా లేకుండా సాక్షాత్తు తండ్రి సమానుడైన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించాడు. ప్రజలు ఆగ్రహం, ఆవేశం రూపంలో ఎన్టీఆర్‌ పైనుంచి మీపై చెప్పులు వేయిస్తే దాన్ని వైయస్‌ఆర్‌ సీపీకి అంటగట్టే పరిస్థితి.

ఆరు మాసాలుగా సీఎం వైయస్‌ జగన్‌పై మీరు తెలుగు చంపేస్తున్నారు. ఇసుక హైదరాబాద్‌కు పంపిస్తున్నారనే రెండు మాటలు తప్పితే.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ అవినీతి చేసిందని ఒక్క రోజు మీరు, మీ పత్రికలు, మీ టీవీలు మాట్లాడలేకుండా పాలన చేశాం. వైయస్‌ జగన్‌ కీర్తి ముందు, మంచి పనుల ముందు నా కుమారుడు లోకేష్‌ రాజకీయ జీవితం ఎక్కడ ఆవిరి అయిపోతుందోనని భయంతో కేడర్‌ను కాపాడుకునేందుకు ఇలాంటి యాత్రలు చేస్తున్నారని తెలుసు.

కనీసం రైతులకు చివరి సంవత్సరం కౌలు కట్టాలనే జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది. రూ.188 కోట్ల కౌలును సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించారు. 2014లో చంద్రబాబు విజన్‌ 2050 అన్నారు.. ఇవాల్టికే మీ వయస్సు 70 ఏళ్లు మరో 30 ఏళ్ల తరువాత 100 ఏళ్లు. అప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటారు.. మీ ప్రభుత్వం ఇలా ఉండాలని పిచ్చి పిచ్చి కలలు.. ఇది మానసిక వ్యాధి తప్పితే ఇంకోటి కాదు. అమరావతిపై మమకారం ఉంటే బాగా పొర్లు దండాలు పెడుతున్నారు. ఐదేళ్లలో రాజధాని శంకుస్థాపనలో మోడీ, నేను ఇసుక, నీరు చల్లామని చెప్పి ఒక్కరోజు అయినా దండం పెట్టుకున్నారా..? ఇవాళ ఆ మట్టికి దండం పెట్టుకునే అవసరం ఏమొచ్చింది.

హైదరాబాద్‌లో రూ.200 కోట్లు పెట్టి రాజమహల్‌ లాంటి కోటను నిర్మించుకున్నారు తప్పితే అమరావతిలో రేకుల షెడ్డు కూడా నిర్మించుకోలేదంటే ఈ రాష్ట్ర రాజధాని ఇప్పుడే అవ్వదని మీ సంపూర్ణ విశ్వాసం. చెప్పది ఒకటి.. చేసేది ఒకటి. ప్రజలను మోసం చేస్తారు.. హైదరాబాద్‌లో కోట కట్టుకుంటారు.. ఇక్కడ ఇల్లు మాత్రం కట్టుకోరు.

ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందు నుంచి స్థలం కొనుక్కొని, సొంతంగా ఇల్లు కట్టుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందే ఆ ఇంట్లోకి వచ్చిన చిత్తశుద్ధి వైయస్‌ జగన్‌ది. ఈ రాజధానిపై సీఎం వైయస్‌ జగన్‌కు చిత్తశుద్ధి ఉంది. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌.. లోకేష్‌ పసలేని మనిషి. అబద్దాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే భావనలోంచి.. మానసిక రుగ్మతలోంచి బయటకు రావాలని, వయస్సు తగ్గట్లుగా చంద్రబాబు ప్రవర్తించాలని కోరుకుంటున్నానని మంత్రి పేర్ని నాని అన్నారు.

Read Also: చంద్రబాబు దళిత ద్రోహి

 

 
Back to Top