చంద్రబాబు దళిత ద్రోహి

అమరావతిలో బాబు చేసిన అభివృద్ధి శూన్యం

సీఆర్‌డీఏను చంద్రబాబు రియలెస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చారు

బాబు అంబేడ్కర్‌ స్మృతివనంకు ఎందుకు వెళ్లలేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

అమరావతి: ఐదేళ్లలో అమరావతిని భ్రమరావతిగా మార్చాడు తప్పితే.. చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఇడ్లీ పాత్ర లాంటి నమూనాతో రాజధానిని చూపించి మభ్యపెట్టారని అన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. బీడు బారిన భూములు తప్ప రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఏం చూసేందుకు అమరావతికి వచ్చారని ప్రశ్నించారు. రైతులను మభ్యపెట్టి భూములు తీసుకున్న చంద్రబాబు ప్యాకేజీల్లో కూడా తేడా చూపించారన్నారు. దళితులు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత చిన్న చూపో భూములకు ఇచ్చే ప్యాకేజీలోనే అర్థమైందన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని అందరికీ తెలుసన్నారు.

అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం అయినా కట్టారా అని ప్రశ్నించారు. వర్షం వస్తే నీరు లోపలికి వచ్చే అసెంబ్లీ, సచివాలయాలను చంద్రబాబు నిర్మించాడన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రైడింగ్‌ జరిగిందని, హెరిటేజ్‌ భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మూలంగా రాజధాని ప్రాంత రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు. అమరావతికి వచ్చిన చంద్రబాబు సాష్టాంగ నమస్కారం పెట్టేముందు అంబేడ్కర్‌ స్మృతివనంకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను డైవర్ట్‌ చేయడానికి గతంలో అంబేడ్కర్‌ స్మృతివనం అని తీసుకువచ్చాడని, 120 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం అభివృద్ధి ఏమయ్యాయని నిలదీశారు. సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియలెస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్చాడని, రైతులను, నిరుద్యోగులను, మహిళలను అందరినీ మోసం చేశాడన్నారు. ఆక్రోశంతో ఉన్న ప్రజలు చంద్రబాబు పర్యటనకు నల్ల జెండాలతో నిరసన తెలిపారన్నారు.

Read Also:  అమరావతి ఒక్కటే కాదు..13 జిల్లాలు ముఖ్యమే

Back to Top