తిరుపతి: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో వైఫల్యం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం వంటి సమస్యలపై జూలై 28న జిల్లా ప్రధాన కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ విద్యా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో కలిసి తుమ్మలగుంటలోని పార్టీ కార్యాలయంలో శనివారం ర్యాలీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని తమ సమస్యలపై గళం విప్పాలని కోరారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువత హక్కుల కోసం చేపడుతున్న ఈ ర్యాలీలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.