సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి

అంబటి రాంబాబు డిమాండ్‌

గుంటూరు లోని తన క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

సాయికృష్ణ ఆచూకీ దొరకలేదని ఈనెల 29న కోర్టును మరో రెండు వారాల సమయం కోరతారు 

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ పేరుతో నిజాన్ని ఖననం చేసే కుట్ర

లాకప్‌లో చిత్రహింసలు పెట్టి సాయికృష్ణని చంపేశారన్నది నిజం 

ఈ విషయం డీజీపీ, సీపీ, హోంమంత్రి సహా అందరికీ తెలుసు

అయినా పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు 

లాకప్‌లో చంపడమే నేరమైతే శవాన్ని కాల్చి బూడిద కూడా లేకుండా మాయం చేశారు

సీఐ నాగరాజును బలిచేసి మిగతా పోలీసులంతా తప్పించుకోవాలని చూస్తున్నారు

ఈ దారుణంలో భాగస్వాములైన ఏ ఒక్క అధికారినీ వదిలే ప్రసక్తే లేదు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన అంబటి రాంబాబు

గుంటూరు: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. సాయికృష్ణను లాకప్‌లో చంపేసి, గుట్టుచప్పుడు కాకుండా పోలీసులే దహనం చేశారని, అయినా అతనింకా బతికే ఉన్నాడని కోర్టును నమ్మించే కుట్రలు జరుగుతున్నాయని అంబటి రాంబాబు తెలిపారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌ విషయం రాష్ట్ర డీజీపీ, విజయవాడ సీపీతో పాటు, హోం మంత్రి అనిత కు కూడా తెలుసని అన్నారు. అయినా, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో పాటు, ఈనెల 29న తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించడంతో చేసేదేం లేక సీనియర్‌ ఐపీఎస్‌తో కమిటీ అంటూ నిజాన్ని ఖననం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెర లేపిందని మండిపడ్డారు. 
    ఎల్లో మీడియాలో చనిపోయిన కుర్రాడిని గ్యాంగ్‌స్టర్‌గా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయని, క్రూరమైన వ్యక్తిగా చిత్రీకరించి అలాంటివాడిని చంపేసినా తప్పు లేదని సమాజాన్ని నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్స్, నేరస్తులను చంపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని మాజీ మంత్రి ప్రశ్నించారు.
    గాదె విజయలక్ష్మి కడుపు కోత ఒక తల్లిగా హోంమంత్రి అనిత అర్థం చేసుకోలేకపోవడం దారుణమని అంబటి రాంబాబు అన్నారు. జనసేన కార్యకర్తను అత్యంత పాశవికంగా చంపేస్తే చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ మంతనాలు సాగించడం సిగ్గుచేటని, మాకన్నా ముందే పవన్‌ కళ్యాణ్‌ దీనిపై స్పందించి ఉంటే ఆయన నిజాయితీ పరుడని, చట్టాన్ని, న్యాయస్థానాలను గౌరవిస్తారని ప్రజలు అనుకునే వారు కదా అన్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌తో సంబంధం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలే ప్రసక్తే లేదని అందరికీ శిక్షపడేదాకా వైయస్సార్సీపీ న్యాయస్థానాల్లో పోరాడుతుందని గుంటూరులోని తన క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఇంకా మాట్లాడారంటే..:

- ఎల్లో మీడియాలో గ్యాంగ్‌స్టర్‌గా చిత్రీకరణ:
    
కాపు యువకుడైన సాయికృష్ణను అత్యంత పాశవికంగా లాకప్‌లో చంపేసి బూడిద కూడా దొరక్కుండా మాయం చేసిందే కాకుండా అతడి తల్లి తన బిడ్డ ఆచూకీ గురించి అడిగితే దానికి సమాధానం చెప్పలేక ఎల్లోమీడియాలో గ్యాంగ్‌స్టర్‌గా చిత్రీకరిస్తున్నారు. ఒక రౌడీ, గ్యాంగ్‌ స్టర్‌ని చంపేసినా తప్పేంలేదని సమాజాన్ని నమ్మించడానికి ముందస్తు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ క్రిమినల్‌ అయినంత మాత్రాన వారిని చంపేసే హక్కు రాజ్యాంగం పోలీసులకు ఇచ్చిందా?.
    విచారణ పేరుతో గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసి బూడిద కూడా మాయం చేశారు. ఈనెల 29న గాదె సాయికృష్ణను తమ ఎదుట హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించడంతో ఉలిక్కిపడ్డ పోలీసులు, కూటమి ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెర తీశాయి.

- కోర్టును మోసం చేసే కుట్ర:

సాయికృష్ణ మిస్సింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు, డీజీపీ, హోం మంత్రి, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ అత్యవసర సమావేశం అంటూ బ్రేకింగ్స్‌ వేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపిస్తామని చెబుతున్నారు. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో ఒక పద్దతి ప్రకారం కోర్టును మోసం చేసే ప్రక్రియ జరగబోతోంది. ఈనెల 29న న్యాయస్థానం ముందు హాజరై సాయికృష్ణ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, ఇంకా రెండు వారాలు సమయం కావాలని అడుగుతారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విచారణలో సాయికృష్ణ చాలా నేరాల్లో నిందితుడని, ఆయనపై హత్యాయత్నం కేసులున్నాయని చెబుతారు. గ్యాంగ్‌స్టర్‌ అని, ఏ గ్యాంగ్‌ వార్‌లో ఏం జరిగిందో తేలడం లేదని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని కాలయాపన చేసి ఎప్పటికీ సాయికృష్ణ లాకప్‌ డెత్‌ను మిస్టరీగా మార్చే కుట్ర జరుగుతోంది.

- కానీ.. ఇదే వాస్తవం:

    కానీ, గాదె సాయికృష్ణ బతికి లేడన్నది నిజం. అతడిక తిరిగి రాడన్నదీ నిజం. లాకప్‌ డెత్‌ అయిన వెంటనే సీఐ నాగరాజు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తే డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, విజయవాడ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు, హోంమంత్రి అనిత నేతృత్వంలోనే సాయికృష్ణ శవాన్ని కాల్చి బూడిద చేశారన్నది కూడా నిజం. సాయికృష్ణ చనిపోయాక ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులు శవాన్ని ఆస్పత్రికి, మార్చురీకి తిప్పుతూ కాలయాపన చేశారు. మృతదేహాన్ని బాత్రూమ్‌లో అమానవీయంగా పడేశారు. చివరికి పోలీసులంతా కుమ్మక్కై శవాన్ని కాల్చి బూడిద చేశారు. 

- విచారణ పేరుతో నిజాన్ని భూస్థాపితం చేసే కుట్ర:
    
సాయికృష్ణ శవం కూడా దొరక్కుండా ఎలాగైతే కాల్చి బూడిద చేశారో అదే విధంగానే ఐపీయస్‌ అధికారితో కమిటీ పేరుతో కాలయాపన చేసి నిజాన్ని పూడ్చిపెట్టాలని చూస్తున్నారు. ఒకవైపున ఈ పని చేస్తూనే ఇంకోపక్క నుంచి డబ్బులతో ప్రలోభ పెట్టి సాయికష్ణ కుటుంబం నోరు మూయించాలని చూస్తున్నారు. మాట్లాడకుండా ఉండేందుకు కోటి రూపాయలు ఇస్తామని మధ్యవర్తిగా జనసేన నాయకుడిని పంపించారు. ఈ కేసులో సీఐ నాగరాజును బలిచేసి మిగతా వారంతా తప్పించుకోవాలని చూస్తున్నారు.

- ఈ దారుణంలో భాగస్వాములైన ఎవర్నీ వదలిపెట్టం:
    
లాకప్‌లో చంపేయడమే పెద్ద నేరమైతే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు శవాన్ని కూడా లేకుండా కాల్చి బూడిద చేశారు. విజయవాడ నడిబొడ్డున సీఎం, డిప్యూటీ సీఎం ఇళ్లకు, డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న కష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో ఇంత దారుణం జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చాక మారుమూల ప్రాంతాల్లో జరిగిన ఎన్ని దారుణాలను వెలుగులోకి రాకుండా చీకట్లోనే మాయం చేశారో అన్న అనుమానం కలుగుతోంది. 
    సాయికృష్ణ లాకప్‌డెత్‌ బాధ్యులెవరినీ వదిలిపెట్టబోమని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయపోరాటం చేస్తామని అంబటి రాంబాబు హెచ్చరించారు.

Back to Top