విశాఖపట్నం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ ల్యాండ్‌టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పచ్చి అబద్దాలకోర్లుగా విషప్రచారం చేస్తున్నారని, దానిపై ఏమాత్రం అవగాహన లేకుండా మోసగాళ్లలా మాట్లాడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హక్కుదారులకు కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారని.. ఒరిజినల్ ప్రభుత్వం దగ్గరే ఉంటాయనేది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ప్రచారం చేస్తున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, ప్రభుత్వంపై నిందలేస్తూ తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనేది తెలుగుదేశం, దాని అనుబంధ పార్టీలతో పాటు వారికి వత్తాసుపలికే పచ్చ మీడియా తాపత్రయమన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తోన్న వాళ్లను క్రిమినల్స్‌తో పోల్చడం తప్పేంకాదన్నారు. లేనిపోని విషయాలపై ప్రజలకు తప్పుడు సమాచారం అందించి గందరగోళంలోకి నెట్టేవారిని క్రిమినల్స్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనేది ఇంకా పరిశీలన స్థాయిలోనే ఉంది. వందేళ్ల తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో భూముల రీ సర్వే మాత్రమే జరుగు తోంది. భూవివాదాల పరిష్కారానికి సంబంధించి ప్రజలకు మేలు చేసేలా వందేళ్ల చరిత్రను మార్చేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఈ రీసర్వే ప్రక్రియ కు పూనుకోవడం హర్షించదగ్గ విషయం. దీన్ని మరుగునబెట్టి.. కేవలం ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అమల్లో లేని చట్టంపై మాట్లాడి ప్రజల్లో విషబీజాలు నాటడమనేది సంస్కారవంతమైన రాజకీయం కాదని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు గుర్తెరగాలి. రామోజీ తప్పుడు రాతలపై క్రిమినల్ కేసు పెట్టాలి.. పచ్చమీడియా దుష్ప్రచారం ప్రతీ అంశాల్లోనూ తారాస్థాయిలో ఉంటుంది. పత్రికా విలువలను దిగజార్చే ఇలాంటి జర్నలిజం ప్రజల నుంచి మన్నన లు పొందదు. ఇవాళ, ఈనాడు రాతలను ప్రజలు అసహ్యించుకుంటున్నా రు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును అమలు చేస్తున్నామని.. రిజిస్ట్రేషన్లు చేసుకున్నోళ్లకు కేవలం జిరాక్స్ పత్రాలే ఇస్తున్నట్లు రామోజీకి ఎవరు చెప్పారు..? ఆయనేమన్నా రిజిస్ట్రేషన్ శాఖ అధికారిగా పనిచేస్తున్నాడా..? నీకు నువ్వే ఊహల్లో విషాన్ని నూరి ఏదిబడితే అది ప్రజల మెదళ్లల్లోకి ఎక్కిస్తావా..? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే, ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజల్ని గందరగోళపరిచే నీ మీద.. నీ పత్రిక మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. జిరాక్స్ పత్రాలిస్తారనేది పచ్చి అబద్ధం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలైతే భూహక్కుదారులకు జిరాక్స్ పత్రాలిస్తారనేది పచ్చి అబద్ధం. తెల్లకాగితం మీదనే రిజిస్ట్రేషన్ చేస్తారనే మాటల్లో నిజం లేదు. రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు డాక్యుమెంట్ మొదటి పేజీ తప్పనిసరిగా రూ.100 స్టాంప్ పేపర్ ఉంటే.. దానికి అనుబంధ కాపీలను రిజిస్ట్రేషన్ శాఖ ఒక పర్మినెంట్ విధానంతో తయారు చేసింది. వాటిల్లో భూహక్కుదారుల వివరాలు, విక్రయదారు, కొనుగోలుదారుతో పాటు భూమి స్వభావం, షెడ్యూల్‌లో సమగ్ర భూసర్వేలో వచ్చిన ప్లాట్ నెంబర్‌తో సహా అన్ని అంశాలు పొందుపరిచి ఉంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ యూనిఫాంగా పెట్టిన డాక్యుమెంట్ కాపీలను నింపాకే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది పారదర్శక విధానం. రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి స్వయంగా రిజిస్ట్రేషన్ అధికారి సమక్షంలో డిజిటల్ సిగ్నేచర్ కూడా పెట్టాల్సి ఉంది. ఇక, ఇంత కన్నా పారదర్శక విధానం ఏముంటుంది..? ఈ విధానం పట్ల ఎలాంటి సందేహాలకు ఆస్కారం ఉండదు. ఆలూచూల్లేని చట్టాన్ని రద్దుచేస్తాననడంపై చంద్రబాబు సిగ్గుపడాలి అవినీతిరహిత రిజిస్ట్రేషన్ల కోసం మా నాయకులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. భూవివాదాలకు ఆస్కారం లేనివిధమైన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తోన్నారు. ఇదిలా ఉంటే, ఆలూచూలు లేని హడావిడంటూ చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అధికారంలోకొస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తాడంట. సిగ్గుండాలి. చంద్రబాబు, ఈనాడు పత్రిక, రామోజీరావు కలిసి ఈ ప్రభుత్వ వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నారు..? ఎంతసేపూ.. నీ రాజకీయ ప్రాపకమేనా...? నువ్వు మాట్లాడేదానిలో వాస్తవాల్లేంటో గమనించవా..? నీలాంటోళ్లు ఇన్నాళ్లూ రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడు. చట్టాన్ని పటిష్టం చేశాకే అమలు భూములకు సంబంధించిన చట్టాలపై కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అనేకమార్లు రాష్ట్రాలను సంప్రదించడం.. అభిప్రాయాలను సేకరించడం వాటికి అనుగుణంగా చట్టాల్ని రూపకల్పన చేయడం పరిపాటిగానే ఉంటుంది. అయితే, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై రాష్ట్రంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదు. ఈ చట్టం ఇంకా అమలులో లేదు. కేవలం పరిశీలన స్థాయిలో నే ఉంది. దీనిపై ఇప్పటికే రెవెన్యూ మంత్రితో పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. భూహక్కుదారులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా.. పటిష్టం చేశాకే దీన్ని అమల్లో తెస్తాం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. రాజకీయాల్లో ట్రెండ్‌సెట్టర్‌గా సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఒక యూనిక్‌గా ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. 2019లో ఆయన ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అంశాల్ని 99.4 శాతం నెరవేర్చిన ఐదేళ్ల పరిపాలనా విధానం, ఇప్పుడు 2024 ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడమనేది దేశ రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. అదే చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశాడు. 2024 వచ్చేసరికి ఐదుపేజీల మేనిఫెస్టో విడుదల చేసుకున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ 2019లో నాలుగు పేజీల మేనిఫెస్టో ఇస్తే.. 2024లో మరో నాలుగుపేజీలతో కలిపి 8 పేజీలు ఇచ్చింది. అంటే, చంద్రబాబు 100 పేజీల పుస్తకాన్ని కాస్తా మా పార్టీ మాదిరిగా 10 పేజీలలోపుగానే తెచ్చాడు. దీన్నిబట్టి.. అందరూ అర్ధం చేసుకోవాల్సింది ఏమంటే.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయితీతో, నిబద్ధతతో ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెచ్చిన మార్పే.. వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో. ఏదైనా చేసేదే చెప్పాలి. చెప్పిందే చేయాలి తప్ప.. చంద్రబాబు మాదిరిగా బోగస్ వాగ్ధానాలు చేస్తే ప్రజలెవ్వరూ నమ్మరు. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్‌గా మేమెంత పవిత్రంగా చూసు కున్నామో.. అలా చచ్చినట్టు మిగతా పార్టీలు కూడా మా బాటకొచ్చేశారు. కూటమి నేతలే అంగీకరించని చెత్తబుట్ట మేనిఫెస్టో అది చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు బీజేపీ భాగస్వామ్యంతో 2014 ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌తో సహా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మోదీ ఫొటోలు వేసుకున్నారు. అలాంటిది, 2024కు వచ్చేసరికి కూటమి కట్టారు గానీ.. వారి మేనిఫెస్టోలో మోదీ ఫొటో లేకపోవడం ఏంటి..? చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు పొత్తులో బీజేపీ ఉన్నట్టా.. లేనట్టా..? మీ మేనిఫెస్టో ను కూటమి భాగస్వామ్యులే అంగీకరించనప్పుడు.. ప్రజలెందుకు అంగీకరించాలి..? దీనిపై ప్రజలెందుకు ఆలోచన చేయాలి..? కూటమి నేతలే అంగీకరించలేని ఈ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయడానికి తప్ప మరెందుకు పనికొస్తుంది..? దీనిపై రాష్ట్రప్రజలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సమాధానం చెప్పాలి.