అమ‌రావ‌తి రైతుల‌ ప‌క్షాన న్యాయ‌స్థానాల్లో పోరాడ‌తాం 

రాజ‌ధానికి భూములిచ్చి న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతుకీ వైయ‌స్ఆర్‌సీపీ అండ‌

ప్ర‌భుత్వ దౌర్జ‌న్యాల‌ను చూస్తూ ఊరుకునేది లేదు

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హెచ్చ‌రిక‌ 

మంగళగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నివాసంలో జ‌రిగిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. 

అంబ‌టి రాంబాబుతో పాటు ఈ మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌, 
వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, లేళ్ల అప్పిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ 
స‌భ్యులు, అమ‌రావ‌తి రైతులు తదిత‌రులు పాల్గొన్నారు. 

ల్యాండ్ పూలింగ్‌లో అడుగ‌డుగునా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న  

రాజ‌ధాని రైతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంది

సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్ట‌డానికి కూడా పార్టీ లీగ‌ల్ సెల్ సిద్ధం 

ప‌రిహారం చెల్లింపుల్లో ఉండ‌వ‌ల్లి రైతుల‌కు తీవ్ర అన్యాయం

భూములిచ్చిన సామాన్య రైతుల‌కు చెరువుల్లో ప్లాట్ల కేటాయింపు 

టీడీపీ నాయ‌కుల‌కు మాత్రం ప్రైమ్ ఏరియాల్లో ప్లాట్లు 

అధికారులే బ్రోక‌ర్లుగా మారి రైతుల‌ను వేధిస్తున్నారు

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్ర ఆగ్ర‌హం 

తాడేప‌ల్లి: అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పేరుతో రైతుల‌ను బెదిరించి దౌర్జ‌న్యంగా భూములు లాక్కుంటున్న చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వానికి ఖ‌చ్చితంగా బుద్ది చెప్పి తీరుతామ‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం కార‌ణంగా న‌ష్ట‌పోతున్న ప్ర‌తి రైతు ప‌క్షాన నిల‌బ‌డి వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌స్థానాల్లో పోరాడుతుంద‌ని  సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశంలో తీర్మానించిన‌ట్టు చెప్పారు. మంగళగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీసమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నివాసంలో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అనంత‌రం ఆయ‌న మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వలేదనే కోపంతోనే ప్రభుత్వం రైతుల పొలాలను ధ్వంసం చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. శని, ఆదివారాలు కోర్టులు ఉండవు కాబట్టి, పక్కా ప్రణాళికతో శుక్రవారం నాడు దౌర్జన్యంగా పొలాల మీద పడి, భారీగా పోలీస్ బలగాలను పంపించి, బుల్డోజర్లతో పంటలను నాశనం చేసి భూములను స్వాధీనం చేసుకున్నారని మండిప‌డ్డారు. రైతులకు ల్యాండ్ పూలింగ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం ప్రొసీజ‌ర్ పూర్తి కాకుండానే ఆ పొలాల్లో దౌర్జన్యంగా మట్టి తోలుతున్నారని చెప్పారు. అమరావతిలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక, వైయ‌స్ఆర్‌సీపీ రాజధానికి వ్యతిరేకమంటూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నార‌ని చెప్పారు. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టేదాకా వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చ‌రించారు. రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేసేది తప్పని నిరూపించేదాకా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. 

- రాజ‌ధానిలో ఆర్గ‌నైజ్డ్ అవినీతి

భూములివ్వడం ఇష్టం లేక బుల్డోజ‌ర్ల‌కు అడ్డొచ్చిన రైతులను, మహిళలను దారుణంగా ఈడ్చి పడేశారు. పూలింగ్‌కి భూములివ్వలేదని కక్ష కట్టి వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. టీడీపీ నాయకులకు తప్ప రాజధానికి భూములిచ్చిన సామాన్య రైతులకు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు. సామాన్యులకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తుంటే, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ప్రైమ్ ఏరియాల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారు. అధికారులే బ్రోకర్లుగా మారి పూలింగ్ పేరిట భూములు సేకరించి, టీడీపీ నాయకుల చేతుల్లో పెట్టి కమీషన్లు తీసుకుంటున్నారు. అమరావతిలో ఆర్గనైజ్డ్‌గా అవినీతి జరుగుతోంది. రైతులను ఏయే అధికారులు బెదిరించి భూములు లాక్కుని టీడీపీ నాయకులకు అప్పజెబుతున్నారో వారి పూర్తి లిస్టు మా దగ్గర ఉంది. ఎప్పటికైనా అధర్మం మీద ధర్మమే గెలుస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వమే రైతులపై రౌడీయిజం చేస్తోంది. చర్చలకు పిలవకుండా చిన్న, సన్నకారు రైతుల మీద పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించడం హేయం. భూములివ్వని ఏ రైతుకైనా ఇదే గతి పడుతుందని భయపెట్టేలా మెసేజ్ పంపడమే ప్రభుత్వ ఉద్దేశమా? 

- భూసేక‌ర‌ణ‌లో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న 

ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించి మరీ భూదోపిడీకి, అక్రమ భూసేకరణకు పాల్పడటం సిగ్గుచేటు. ఉండవల్లిలో ఎకరం రూ. 7 కోట్లు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం రూ. 2.47 కోట్లు మాత్రమే చెల్లించాలని చూడటం దుర్మార్గం. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఈ ప్రాంతంలో ఉన్న భూమికి రూ. 5 కోట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాంటిది బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి ధర రూ. 7 కోట్లకు పైనే ఉంటుంది. అమరావతిలో చదరపు అడుగుకి రూ. 20 వేలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు, రైతులకు మార్కెట్ రేటు ఎందుకు చెల్లించలేరు? రైతులు కమీషన్లు ఇవ్వరు కాబట్టే వారికి అన్యాయం చేసి, కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు.

- సుప్రీంకోర్టు త‌లుపులు త‌డ‌తాం

అమ‌రావ‌తి రైతుకి సమస్య వచ్చిన ప్రతిసారీ బాధితుల పక్షాన నిలబడి వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది. కాకితో కబురుపెట్టినా వెళ్లి వారి ప‌క్షాన ఉద్యమిస్తాం. బాధిత కుటుంబాల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ న్యాయస్థానాల్లో పోరాడుతుంది. అమరావతి రైతుల పక్షాన సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి కూడా వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి భయపడి ఈ రోజున కొద్దిమంది రైతులే బయటకొచ్చి పోరాటం చేస్తుండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఎదిరించే బాధితుల సంఖ్య చూసి ప్రభుత్వం కూడా దిమ్మతిరిగి మూర్ఛపోయే పరిస్థితి వస్తుందని అంబ‌టి రాంబాబు అన్నారు.

Back to Top