స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

 పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పిలుపు

బద్వేల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, వైయ‌స్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పిలుపునిచ్చారు. బద్వేల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గోపవరం మండలంలోని అన్ని పంచాయతీల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందన్నారు. రెండేళ్ల పాలనలో కొత్తగా చేసిందేమీ లేదని, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించిందని విమర్శించారు.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందించలేదని, ప్రస్తుతం యూరియా, ఇతర ఎరువులు కూడా సకాలంలో దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రతి పంచాయతీలో పూర్తి ఓటర్ల జాబితాను పరిశీలించాలని నాయకులకు సూచించారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోతే ఫారం–6 ద్వారా నమోదు చేయించాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే దాసరి సుధ భరోసా ఇచ్చారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top