ప్ర‌తి గుండెను క‌దిలించిన మహోన్న‌త వ్య‌క్తి స్వర్గీయ వైయ‌స్ఆర్‌

ప్ర‌జ‌ల హృదయాల్లో ఆయ‌న స్థానం ఎప్ప‌టికీ ప‌దిల‌మే 

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి 

తాడేప‌ల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌హానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా పార్టీ నాయ‌కుల ఘ‌న నివాళి. 

వైయ‌స్ఆర్‌ విగ్ర‌హానికి పూల మాలలు వేసి పుష్పాంజ‌లి ఘ‌టించిన నేతలు. 

అనంతరం రక్తదానం చేసిన పార్టీ అభిమానులు.

దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు, పేదలకు దుస్తుల పంపిణీ. 

పార్టీ కేంద్ర కార్యాలయంలో అన్నదానం.    

తాడేప‌ల్లి: సంక్షేమ ప‌థ‌కాల‌తో, చిరున‌వ్వుతో కూడిన ప‌ల‌క‌రింపుతో ప్ర‌తి గుండెను క‌దిలించిన మహోన్న‌త వ్య‌క్తి దివంగ‌త డాక్టర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారేన‌ని, ప్ర‌జ‌ల గుండెల్లో ఆయ‌న స్థానం ఎప్ప‌టికీ ప‌దిలంగా ఉంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అన్నారు. తాడేప‌ల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మ‌హానేత వైయ‌స్ఆర్‌ వ‌ర్ధంతి సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులతో క‌లిసి వైయ‌స్ఆర్‌ విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఎమ్మెల్సీ, పార్టీ కార్యాల‌య ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు, పేదలకు దుస్తుల పంపిణీని పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి చేతుల మీదిగా ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... స్వర్గీయ వైయ‌స్ఆర్‌ మ‌న‌కు దూర‌మైనా, వైయ‌స్ జ‌గ‌న్ రూపంలో మ‌న‌కు గొప్ప వార‌స‌త్వాన్ని అందించార‌ని, త‌న ఐదేళ్ల పాల‌న‌లో వైయ‌స్ఆర్‌ ఆశ‌యాల‌ను కొన‌సాగించి సంక్షేమ పాల‌న‌కు నిర్వ‌చ‌నం చెప్పార‌ని అన్నారు. ఇప్పుడు ప్ర‌జ‌లు సంక్షేమ పాల‌న‌కు, దుష్ట‌పాల‌న‌కు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని స్ప‌ష్టంగా అర్థం చేసుకున్నార‌ని పేర్కొన్నారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ నాయకుడు వైయ‌స్ఆర్ 

మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి గారు మ‌న‌కు దూర‌మై నేటికి ప‌ద‌హారేళ్లు గ‌డిచిపోయింది. రచ్చ‌బండ కార్య‌క్ర‌మం కోసం హెలిక్యాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరి వెళ్లిన మ‌హానేత శాశ్వ‌తంగా మ‌న‌కు దూర‌మైపోయారు. కానీ ఆయ‌న చేసిన మంచి పనుల రూపంలో ఎప్ప‌టికీ మ‌న గుండెల్లో శాశ్వ‌తంగా నిలిచి ఉంటారు. వైయ‌స్ఆర్‌ని ఒక్క‌సారి క‌లిసిన వారెవ‌రైనా ఎప్ప‌టికీ ఆయ‌న్ను మ‌ర్చిపోలేరు. ఆయ‌న ఫొటోలు, వీడియోలు చూసిన‌ప్పుడలా క‌ళ్లు చెమ్మ‌గిల్లి, గుండెలు బరువెక్క‌కుండా ఉండ‌వు. కోట్లాది మంది కుటుంబ సభ్యుల‌ను క‌లిగి ఉన్న అరుదైన గొప్ప నాయ‌కుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గారు. రాజ‌కీయాల్లో విల‌క్ష‌ణ నాయకుడు వైయ‌స్ఆర్‌. మాన‌వ‌త్వంతో కూడిన పాల‌న చేసిన నాయ‌కుడు. మొండిగా నిల‌బ‌డే ధీర‌త్వం, శ‌త్రువును సైతం క్షమించ‌గ‌లిగే ఉదారత‌.. అన్ని గుణాలు క‌ల‌బోసిన మ‌హోన్న‌త శ‌క్తి వైయ‌స్ఆర్‌. ఏ పార్శ్యం నుంచి చూసినా అంద‌రూ ఆయ‌న‌కి జై కొట్టాల్సిందే. మ‌న మ‌ధ్య‌లో ఉన్న మ‌నిషి తాను చేసిన గొప్ప ప‌నులతో మ‌హ‌ర్షిలా ఎదిగారు. పేద‌రికం, వెనుక‌బాటుతనాన్ని పార‌ద్రోలడానికి సిద్ధాంతాలు, స‌మీక్ష‌ల పేరుతో కాల‌యాపన చేయ‌డం స‌రైన విధానం కాద‌ని, స‌హ‌జ స్వ‌భావాల‌తో ఆలోచించి చికిత్స చేయాల‌ని నిరూపించిన సామాజిక వైద్యుడు వైయ‌స్ఆర్‌. రైతులు, విద్యార్థులు, మ‌హిళ‌లు.. ఇలా అన్ని వర్గాల వారిని ముందుకు న‌డిపించిన ధీశాలి. తాను తీసుకొచ్చిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు త‌ప్ప‌క కొనసాగించాల్సిన ప‌రిస్థితి క‌ల్పించారంటే స‌మాజం మీద ఆయ‌నకున్న దూర‌దృష్టికి ఇదే నిద‌ర్శ‌నం. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మ‌న‌కి తెలియ‌కుండానే మ‌న స‌మాజంలో పెనుమార్పులు తీసుకొచ్చిన మ‌హ‌నీయులు దివంగ‌త వైయ‌స్ఆర్‌. ఉచిత క‌రెంట్ తీసుకొచ్చి ఎంతోమంది రైతులకు, ఆరోగ్య‌శ్రీ ద్వారా ప్ర‌తి పేద కుటుంబాన్ని, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ద్వారా కోట్ల మంది విద్యార్థుల జీవితాల‌ను ప్ర‌భావితం చేసిన ఆద‌ర్శ‌ప్రాయుడు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన వారంతా అదృష్ట‌వంతులు. 

వైయస్ఆర్‌ ఆశయాలకు ప్రతిరూపం వైయస్ జగన్  

మహానేత వైయస్ఆర్ భౌతికంగా మనకు దూరమవుతూ... ఆయన కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి గారి రూపంలో బ్ర‌హ్మాండ‌మైన వార‌స‌త్వాన్ని మ‌న‌కు ఇచ్చి వెళ్లారు. వైయ‌స్ఆర్‌ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్ల‌డంలో వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌వంతం అయ్యారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఈ ప్ర‌జా సంక‌ల్పంలో మ‌న‌ల్ని అంద‌ర్నీ భాగ‌స్వాముల్ని చేసినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రూపంలో కోట్లాది మందిమి ఒక కుటుంబంగా చెక్కుచెద‌ర‌కుండా ఉన్నామంటే అది వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌తే. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో వైయ‌స్ఆర్‌ ఆశ‌యాల‌ను సంక్షేమ ప‌థ‌కాల రూపంలో వైయ‌స్ జ‌గ‌న్ గారు ఎంత గొప్ప‌గా అమ‌లు చేశారో మ‌నమంతా చూశాం. సంక్షేమ ప‌థ‌కాల‌కు వైయ‌స్ఆర్‌ బీజం వేస్తే గ‌త ఐదేళ్ల పాల‌న‌లో అంత‌క‌న్నా మెరుగ్గా మ‌రిన్ని ప‌థ‌కాల‌ను ముందుకు తీసుకెళ్ల‌గ‌లిగారు. సంక్షేమ ఫ‌లాలు అందుకున్న ప్ర‌తి కుటుంబానికీ వాటి విలువ తెలుసు. ప్రతిప‌క్షంలో ఉన్నప్ప‌టికీ ఈరోజు కోట్లాదిమంది వైయ‌స్ఆర్‌సీపీ ప‌క్షాన నిల‌బ‌డ్డారంటే దానికి వైయ‌స్ జ‌గ‌న్ అందించిన ఐదేళ్ల పాల‌న వ‌ల్లే సాధ్య‌మైంది. 

దుష్ట‌పాల‌న‌కు మంచి పాల‌న‌కు ప్ర‌జ‌లు తేడా గుర్తించారు

పెద్ద పెద్ద మార్పులు కావాలంటే గొప్ప ఆలోచ‌న‌ల‌తోనే సాధ్య‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ నిరూపించారు. పాల‌కుడు ఎలా ఉండాలి? ప్ర‌జాస్వామ్యం ఎలా ఉండాలి?  పాల‌న ఎలా ఉండాలి అనుకున్న ప్ర‌తి సంద‌ర్భంలోనూ వైయ‌స్ఆర్‌గుర్తుకొస్తారు. అలాంటి మ‌హోన్న‌త వ్య‌క్తి ఆశ‌యాల‌ను కొన‌సాగించ‌డం క‌త్తిమీద సాము లాంటిది. కానీ ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్యాన్ని సాధించి చూపించారు. మ‌నం చేసిన మంచి ప‌నులే మ‌న‌ల్ని చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిల‌బెడ‌తాయ‌ని నిరూపించిన గొప్ప నాయ‌కులు దివంగ‌త వైయ‌స్ఆర్‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌. అంత గొప్ప‌గా ప‌రిపాలించి చూపించారు కాబ‌ట్టే మంచి పాల‌న‌కు దుష్ట‌పాల‌న‌కు తేడాను ప్ర‌జ‌లిప్పుడు గుర్తించారు. అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కే వ్య‌క్తుల నిజ‌స్వ‌రూపాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. మ‌న‌ల్ని ఒక్క‌టిగా క‌ట్టిప‌డేసిన గొప్ప ఆయుధం వైయ‌స్ఆర్‌ నుంచి వచ్చిన వార‌స‌త్వమే. వైయ‌స్ జ‌గ‌న్ ఉన్నంత వ‌ర‌కు దుష్ట‌శ‌క్తుల ఆట‌లు సాగ‌వు. తాత్కాలికంగా పైచేయి క‌నిపించినా అంతిమ విజ‌యం మాత్రం మంచి, మాన‌వ‌త్వానిదే. వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని స‌ర్వ‌తోముఖాభివృద్ధి దిశ‌గా న‌డిపించ‌డంలో వైయ‌స్ఆర్‌సీపీ ముందుంటుంది. అందులో మ‌నమంతా భాగస్వాములుగా ఉండ‌టం మ‌న అదృష్టం అనే విష‌యాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. వైయ‌స్ఆర్‌ ఆశ‌యాల‌ను కొనసాగించ‌డ‌మే ఆయ‌న‌కు మ‌నమిచ్చే గొప్ప నివాళి. దేశ వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.  

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ కార్యాల‌య ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, ప‌బ్లిసిటీ వింగ్ స్టేట్  ప్రెసిడెంట్ కాకుమాను రాజ‌శేఖ‌ర్‌, గుంటూరు పార్ల‌మెంట్ ప‌రిశీలకులు పోతిన మ‌హేష్‌, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, ర‌విచంద్ర‌, పార్టీ అధికార ప్ర‌తినిధులు జూపూడి ప్రభాక‌ర్‌, కొమ్మూరి క‌న‌క‌రావు, గ్రీవెన్స్‌ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top