నంద్యాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నంద్యాల గడ్డపై వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైయస్ఆర్‌సీపీ నంద్యాల మండల స్థాయి నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు పురుషోత్తంరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మండల అధ్యక్షుడు బసవేశ్వరరెడ్డి, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ పేరుతో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి నంద్యాల గడ్డపై వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.