తాడేపల్లి: నిత్యం చంద్రబాబును జాకీలతో ఎత్తడం, మరోవైపు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, వైయస్ జగన్‌గారిని నిందించడం, బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఎల్లో మీడియా మరోసారి గతి తప్పిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆక్షేపించారు. గవర్నమెంటు స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లపై ఈనాడు ఒక దిక్కుమాలిన కథనం రాసిందని ఆయన తెలిపారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పని చేయడం లేదంటూ, దుష్ప్రచారం చేస్తూ, ఈనాడు ఒక పనికిమాలిన కథనం రాసిందని ఆక్షేపించారు. నారా వారి కూలీలా వ్యవహరిస్తూ ఈనాడు కిరణ్ కనీస పరిజ్ఞానం లేకుండా వార్తలు రాయిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగార్జునయాదవ్ చురకలంటించారు. ప్రెస్‌మీట్‌లో నాగార్జున యాదవ్ ఇంకా ఏమన్నారంటే..: విద్యాశాఖ విధ్వంస శాఖగా మారింది: నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత విద్యా రంగం పూర్తిగా భ్రష్టుపట్టి పోయింది. విద్యాశాఖ కాస్త ‘విధ్వంస శాఖ’గా మారింది. ఆయన చేతగానితనం, అసమర్థత వల్లే సమస్యలు వస్తున్నాయి. కానీ వాటిని దాచి పెట్టేందుకు మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు. పక్కాగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు: గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌గారు నాడు–నేడు మనబడి కింద గవర్నమెంట్ స్కూళ్లను సమూలంగా మార్చే పని మొదలుపెట్టారు. అందులో భాగంగా తొలి విడతలో స్కూళ్లలో 12,948, రెండో విడతలో 14,645 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఒక ఏడాది వారంటీ, ఐదేళ్ల మెయింటెనన్స్ గ్యారెంటీతో ప్రతిదీ పక్కాగా లిఖితపూర్వకంగా ఆర్వో ప్లాంట్ల కొనుగోలుతో పాటు, వాటిని పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీసీఎస్ ద్వారా ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి, వాటిలో ఏ సమస్య వచ్చినా 7 రోజుల్లో పరిష్కారం అయ్యేలా వ్యవస్థ ఏర్పాటు చేశారు. నిర్వహణ వదిలేసిన కూటమి ప్రభుత్వం: రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఒకవైపు నాడు–నేడు మనబడి పనులు పూర్తిగా ఆపివేయడంతో పాటు, మరోవైపు స్కూళ్లలో ఆర్వో ప్లాంట్ల నిర్వహణ పూర్తిగా గాలికొదిలేసింది. వాటిలో కనీసం క్యాండిల్స్ కూడా మార్చకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అసలు స్కూల్‌లో ఆర్వో ప్లాంట్ నిర్వహణ బాధ్యతను హెడ్‌మాస్టర్‌పై మోపి చేతులు దులుపుకోవడం సరైనదా? అధికారులతో పని చేయించేది ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎవరు? వారిని కదా.. ఆ పత్రిక బాధ్యులను చేయాల్సింది!. బాధ్యత మర్చిన ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు, ఇలా తన అనుకూల ఎల్లో మీడియాతో నిత్యం గత ప్రభుత్వంపై అసత్య కథనాలు రాయిస్తోంది. ఆ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరింత దిగజారి, గవర్నమెంట్ స్కూళ్లలో ఆర్వో ప్లాంట్ల నిర్వహణ వదిలేసి, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడం అత్యంత హేయమని నాగార్జునయాదవ్ ఆక్షేపించారు.