తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలెండర్లు పేలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడటం బాధాకరమని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. పేలుడు తీవ్రతతో ఇళ్లు ధ్వంసమవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.