తాడేపల్లి : వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ నిర్భంధంపై ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కి లేఖ రాశారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేఖలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని రెయిన్‌బో విల్లాస్ సమీపంలో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో, మఫ్టీలో వచ్చిన పోలీసులు పూడి శ్రీహరిని నడిరోడ్డుపై అడ్డుకుని అక్రమంగా నిర్భంధించి తీసుకెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని, తాము ఎవరు? ఏ స్టేషన్‌కు చెందినవారు? ఏ కేసులో తీసుకెళ్తున్నారు? అనే విషయాలు కూడా తెలియజేయలేదని పేర్కొన్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, ఇంటికి వెళ్లి వస్తానన్నా వినకుండా ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా బలవంతంగా తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన అని లేఖలో పేర్కొన్నారు. ఈ విధమైన చర్య అమానుషం, ఆటవికం, దౌర్జన్యకరమని, మానవహక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, సీసీ కెమెరా దృశ్యాల ప్రకారం, ఈ అరెస్టుకు ముందురోజే నుంచే పోలీసు బృందాలు రెక్కీ నిర్వహించి, తెల్లవారుజామున నుంచే అక్కడ కాపు కాసినట్లు తెలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఈవిధంగా నిర్భంధించడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, కక్షసాధింపు చర్యలకు పోలీసులు సహకరిస్తున్నారని ఈ ఘటన రుజువు చేస్తోందని విమర్శించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు చట్టాన్నే ఉల్లంఘించడం ఆందోళనకరమని అన్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూడి శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డీజీపీని కోరారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించాలని లేఖలో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.