విజయవాడ: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మేడే) సందర్భంగా విజయవాడ చిట్టినగర్ సెంటర్‌లో కార్మిక సంక్షేమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైపిళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి వైయస్ఆర్ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు. కార్మికుల సేవలను గుర్తిస్తూ, వారికి గౌరవార్థం వెలంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా టవల్స్‌ను పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికులకు సహాయంగా ఈ పంపిణీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.