పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి

మెంబర్‌షిప్, ఎస్ఐఆర్‌పై ఫోకస్ పెంచాలి

వైయ‌స్ఆర్‌సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ 

తాడేపల్లి: పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాల‌ని, మెంబర్‌షిప్, ఎస్ఐఆర్‌పై ఫోకస్ పెంచాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కీలక నేతలతో ఆయ‌న‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్యేలు/సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు, అసెంబ్లీ పరిశీలకులు, టాస్క్‌ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ పార్టీ మెంబర్‌షిప్ డ్రైవ్, కమిటీల నిర్మాణంలో నాయకులు, కేడర్ చురుకుగా పనిచేశారని అభినందించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐడీ కార్డుల వెరిఫికేషన్‌లో జాప్యం జరుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ ఐటీ, సోషల్ మీడియా, యూత్, స్టూడెంట్ విభాగాలను మరింతగా వినియోగించుకుని స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తూ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, బూత్ లెవల్ ఏజెంట్లు ముందుగానే డేటా సేకరణ పూర్తి చేసుకోవాలని తెలిపారు. 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగా ఎస్ఐఆర్ జరగనున్న నేపథ్యంలో, ప్రతి ఓటరును గుర్తించి వివరాలు సిద్ధం చేసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. బూత్ లెవల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుని పని చేస్తే ఓట్ల తొలగింపులను అరికట్టవచ్చని అన్నారు. ఈ నెల 15 నుంచి ఎస్ఐఆర్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆసుపత్రుల్లో మందులు లేకపోవడం, శుభ్రత లోపించడం వంటి సమస్యలు పెరిగాయని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రులను సందర్శించి, రోగులతో మాట్లాడి వారి సమస్యలను వెలుగులోకి తేవాలని సూచించారు.

అలాగే పంటల మద్దతు ధరల విషయంలో రైతులు నష్టపోతున్నారని పేర్కొంటూ, ఈ అంశంపై అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తవుతున్న నేపథ్యంలో అవినీతి, దోపిడీ, వేధింపులను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించాలని, వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలబడుతుందని, వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రజలకు అండగా ఉంటారని కార్యక్రమాల ద్వారా తెలియజేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
 

Back to Top